కరోనా మహమ్మారి ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఎందరినో ఆస్పత్రుల పాలు చేయడంతో పాటు.. ప్రాణాలను హరించేస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ ఓ సాహసాన్ని ప్రదర్శించబోతోంది. విదేశాలలో ఇరుక్కుపోయి దుర్భర జీవితం గడుపుతున్న భారతీయ బిడ్డలను స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యతను భుజానికెత్తుకుంటోంది. అందుకు పెద్ద స్థాయిలోనే ప్రణాళికలు రచిస్తోంది. 

 

కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచం గజగజలాడిపోతోంది. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలు బతుకు జీవుడా.. అంటూ లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. ఎక్కడివాళ్లు అక్కడే గప్ చుప్ అన్నట్టుగా ఉంది ప్రపంచ దేశాల పరిస్థితి. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అంతర్జాతీయ విమాన సర్వీసులు క్లోజయ్యాయి. దీంతో భారతీయులు వివిధ దేశాల్లోనే ఇరుక్కుపోయారు. తమ స్వస్థలాలకు చేరుకుందామన్న రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. 

 

మరోవైపు కుటుంబ సభ్యులకు దూరంగా.. సరైన తిండి, గుడ్డ లేక దుర్భర జీవితం గడుపుతున్న వలస కూలీలను వాళ్ల స్వగ్రామాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా వలస కూలీల తరలింపు ప్రక్రియ జరుగుతుండగానే.. వివిధ దేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను సొంత రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

 

అత్యంత కష్టతరమైన ఈ ఆపరేషన్ ను నిర్వహించడంలో భారత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో పౌర విమానయాన శాఖ, నౌకాయాన డైరెక్టరేట్‌ జనరల్‌, ఆరోగ్యశాఖ, భారత వైమానిక దళం, నౌకాదళం, విదేశాంగ శాఖ భాగస్వామ్యమయ్యాయి. ఇప్పటికీ ఈ ఆపరేషన్‌ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

 

ప్రపంచ దేశాధినేతలతో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుండటంతో ప్రవాస భారతీయుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఎప్పుడెప్పుడు స్వదేశాలకు చేరుకొని తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: