క‌రోనాను ప్ర‌పంచానికి అంటించింద‌నే ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కుంటున్న డ్రాగ‌న్ కంట్రీ చైనా ఈ విషయంలో త‌న దుర్మార్గ‌పు పోక‌డ‌ల‌ను కొన‌సాగిస్తోంది. తాజాగా ఈ విష‌యంలో  మ‌రింత త‌ప్పుడు ప్ర‌వ‌ర్త‌నకు పాల్ప‌డింది. క‌రోనా జన్యు సమాచారాన్ని షాంఘై ప్రొఫెసర్‌ ఒకరు వెల్లడించగా, అయితే ఆ మరుసటి రోజే ఆయన ల్యాబ్‌ను చైనా మూసివేసింది. ఈ విష‌యాన్ని అమెరికా వెల్ల‌డించింది.అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీగా కేలీ మెక్‌ఎనానీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప్రెస్‌ సెక్రటరీ హోదాలో  ఆమె తొలిసారి విలేకరులతో మాట్లాడుతూ చైనాపై మండిప‌డ్డారు. 

 

షాంఘై ప్రొఫెసర్‌ వెల్లడించేంతవరకు వైరస్‌ జన్యుక్రమాన్ని చైనా బయటపెట్టలేదని కేలీ ప్ర‌క‌టించారు. `సమాచారాన్ని వెల్లడించిన మరుసటి రోజే ఆ ప్రొఫెసర్‌ ల్యాబ్‌ను చైనా మూసివేసింది. అలాగే మనుషుల నుంచి మనుషులకు వైరస్‌ వ్యాప్తిపైనా సరైన సమయంలో వివరాలు అందించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా అలాగే వ్యవహరించింది. అమెరికా దర్యాప్తు బృందాన్ని చైనాలోకి అనుమతించేందుకు కూడా నిరాకరించారు’ అని ఆమె వివరించారు.

 

ప్రస్తుత సంకేతాలను బట్టి వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటకు వచ్చినట్లు చాలా మంది నిపుణులు భావిస్తున్నారని వైట్ హౌస్ సెక్ర‌ట‌రీ చెప్పారు. కరోనా వ్యాప్తికి చైనానే కారణమని అమెరికాతో పాటు జర్మనీ, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు నిందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాపై ప్రతీకారంగా సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  సంకేతాలిచ్చారు. దీంతో  మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ‘చైనాపై సుంకాలు విధించే అంశాన్ని నిజంగానే పరిశీలిస్తున్నారా లేక అధ్యక్షుడు ఊరకనే చెప్పారా?’ అని విలేకర్లు  శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కేలీ మెక్‌ఎనానీ ప్రశ్నించారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘అధ్యక్షుడిని దాటి నేను ఎలాంటి ప్రకటనలు చేయదలచుకోలేదు. కానీ చైనా పట్ల అధ్యక్షుడు అసంతృప్తితో ఉన్నారని మాత్రం చెప్పగలను.` అని అన్నారు. వైరస్‌కు సంబంధించి చైనా తమకు అవాస్తవ సమాచారాన్ని అందిస్తున్నదని మెక్‌ఎనానీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: