క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో కొన్ని తీపిక‌బుర్లు, కొన్ని షాకింగ్ వార్త‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.  కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి విధించిన లాక్‌డౌన్‌తో పారిశ్రామిక కార్యకలాపాలు నిలిచిపోవడంతోపాటు రోడ్లపై వాహనాల రద్దీ పడిపోయింది. దీంతో వాయు కాలుష్యం కూడా తగ్గింది. దీనివల్ల దేశంలో వైరస్‌ వ్యాప్తి నెమ్మదించిందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో మొత్తం మూడు రకాలైన వైరస్‌లు దేశంలో ఉన్నట్టు గుర్తించిన శాస్త్రవేత్త‌లు దీనిపై మ‌రింత ప‌రిశోధ‌న‌లు కొన‌సాగిస్తున్నారు.

 

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వైద్యులు దేశంలో గత రెండు నెలలుగా వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్‌లో ఏదైనా మార్పు (మ్యుటేషన్‌) జరిగిందా అనే విషయాన్ని అధ్యయనం చేయడానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. మొత్తం మూడు వైర‌స్‌ల‌లో ఒకటి వూహాన్‌ నుంచి, మరొకటి ఇటలీ, మరో వైరస్‌ ఇరాన్‌ నుంచి వచ్చిన రకం అని గుర్తించారు. అయితే ఇరాన్‌ నుంచి వచ్చిన వైరస్‌ మాత్రం చైనా వైరస్‌ని పోలి ఉంది. అయితే మనదేశంలోకి ప్రవేశించిన వైరస్‌ ప్రధాన లక్షణాలను కనుక్కోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందనీ, అయితే అన్నిరకాల వైరస్‌లలో ఒకేరకం ఎంజైములు ఉండడం వల్ల టీకాలు సమర్థవంతంగానే పనిచేస్తాయని భావిస్తున్నారు. 

 

 


కాగా, కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన మరణాల్లో ఎక్కువగా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారే ఉన్నారని తేలింది. ఇలాంటి వ్యాధులకు వాయు కాలుష్యం కారణమైతే, ఆ వ్యాధులే కరోనా వైరస్‌ సంక్రమించడానికి దోహదం చేశాయని ప్రముఖ వైద్య నిపుణులు డా. అరవింద్‌ కుమార్‌ పేర్కొన్నారు. శ్వాస సంబంధిత వ్యాధులు, రక్తపోటు, పక్షవాతం, పీసీఓడీ, ఆస్థమా వంటి అనేక వ్యాధులు రావడానికి, వాయు కాలుష్యానికి మధ్య సంబంధం ఉన్నదనే విషయం వివిధ అధ్యయనాల్లో తేలిందని చెప్పారు. ప్రపచం వ్యాప్తంగా వాయు కాలుష్యం వల్ల ప్రతి ఏడాది 4.2 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. గుండె పోటుతో మరణించేవారిలో 25 శాతం మంది వాయుకాలుష్యం కారణంగానే చనిపోతున్నారని, ఇలా ప్రతి ఏటా 2.4 మిలియన్ల మంది మరణిస్తున్నారు డబ్ల్యూహెచ్‌తో పేర్కొంది. ప్ర‌స్తుతం వాయు కాలుష్యం త‌గ్గ‌డం కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: