ఎంతో ఆర్భాటంగా గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగిన జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క సీటును మాత్రమే దక్కించుకోగలిగింది. ఈ ఎన్నికల్లో పార్టీ అధినేత పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి చెందారు. భీమవరం, గాజువాక లో పవన్ కు ఓటమి  పలకరించగా, మిగతా చోట్ల పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దుస్థితి ఏర్పడింది. అయితే కాస్తలో కాస్త ఊరట ఇచ్చే విధంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు ఆ ఎన్నికల్లో విజయం సాధించడంతో జనసేన ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉండేందుకు అవకాశం  ఏర్పడింది. అయితే ఆ ఆనందం ఆ పార్టీకి ఎంతో కాలం నిలవలేదు. మొదట్లో రాపాక వైసీపీలో చేరబోతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ విషయాన్ని స్వయంగా రాపాక కూడా ఖండించారు.

 

IHG


 తాను వైసీపీలోకి వెళ్తే 152  వ ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోతానని, అదే జనసేనలో ఒకే ఒక్కడిగా తనకు మంచి గుర్తింపు ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైసీపీకి మరింత దగ్గరయ్యారు. అంతే కాకుండా వైసిపి మంత్రితో కలిసి జగన్ ఫోటోకు పాలాభిషేకం కూడా చేశారు. అప్పట్లో దీనిపై జనసేన పెద్ద రాద్ధాంతం చేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగినా ఆ విషయాన్ని పెద్దగా పవన్ పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఇక ఆ తరువాత నుంచి పూర్తిగా జనసేన కార్యక్రమాలకు దూరమయ్యారు. ఓ సందర్భంలో జనసేన పార్టీ మీటింగ్ జరుగుతుండగా రాపాక ను నాదెండ్ల మనోహర్ అవమానించిన తీరు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 


ఇక మొత్తంగా చూస్తే రాపాక వైసీపీలో చేరకపోయినా ఆ పార్టీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీనిపై ఇప్పటికే ఆ నియోజకవర్గంలో జనసైనికులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రాపాక ఫ్లెక్సీ లను సైతం తొలగించారు. ఇక ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగానూ రాపాక వైసీపీ నాయకులతో కలిసి తిరగడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజోలులో రాపాక గెలుపుకు కారణమైన క్షత్రియ సామాజిక వర్గం కీలక నాయకులు కూడా వైసీపీలో చేరిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాపాక వైసీపీకి దగ్గర అయినట్టుగా ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ రాపాక జనసేన ఎమ్మెల్యే గా కొనసాగుతున్నా, ఆ పార్టీ కార్యక్రమాల్లో గాని, వ్యవహారాల్లో గాని తల దూర్చడం లేదు. ఇక పార్టీ కూడా రాపాక ను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది.

 


 ఆయన జనసేన ఎమ్మెల్యే గానే ఇంకా గుర్తింపు పొందుతున్నారు. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉంది. కనీసం ఆయన వ్యవహార శైలిపై బహిరంగంగా విమర్శలు చేసేందుకు కూడా ఆ పార్టీ నాయకులు ఇష్టపడడం లేదు. ఇక అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాపాక వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తున్నారు.ఆయనను వైసీపీ సభ్యుడిగానే ఆయన గుర్తిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే నియోజకవర్గంలోని జన సైనికులకు మాత్రం రాపాక వ్యవహారం మింగుడుపడటంలేదు. తాము ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపిస్తే వైసిపి కి అనుబంధంగా కొనసాగడం ఎంతవరకు కరెక్ట్ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: