అగ్ర‌రాజ్యం అమెరికాలో కరోనా ధాటికి వందల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఓ రూపంలో మృత్యువు వెంటాడుతూనే ఉంది. అయిన‌ప్ప‌టికీ...ఆర్థిక వ్యవస్థల్ని తిరిగి గాడిలో పెట్టేందుకు లాక్‌డౌన్‌ ఆంక్షల్ని తిరిగి కొనసాగించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో ఆ దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం ఆంక్షల్ని ఎత్తివేశాయి. దీంతో డజనుకుపైగా రాష్ర్టాల్లోని రెస్టారెంట్లు, స్టోర్లు, మాల్స్‌ తెరుచుకున్నాయి. ప్రజలు పెద్దఎత్తున కొనుగోళ్లు జరిపారు. ఈ సంద‌ర్భంగా వాళ్లు చేసిన కామెంట్లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.

 

లాక్ డౌన్ ఎత్తేసిన రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌ను అనుభ‌విస్తున్నారు. కొలరాడోలో క్షౌరశాలలు తెరువడంతో పురుషులు బారులు తీరారు. వ్యోమింగ్‌ రాష్ట్రంలో జిమ్‌లు, డే కేర్‌ సెంటర్లు, లూసియానా, నెబ్రాస్కా రాష్ర్టాల్లో రెస్టారెంట్లు, చర్చిలు, మాల్స్‌ తెరుచుకున్నాయి. మైన్‌లో గోల్ఫ్‌ కోర్సులు పునఃప్రారంభమయ్యాయి. దక్షిణ కరోలినాలో బీచ్‌లు, పార్కులను అధికారులు తెరిచారు. టెక్సాస్‌లో రెస్టారెంట్లు తెరువడంతో ప్రజలు పోటెత్తారు. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఆర్లియాన్స్‌లోని ఓ కేఫ్‌లో కూర్చున్న ఓమహిళా అకౌంటెంట్‌ స్పందిస్తూ.. ‘జైలు నుంచి బయటపడ్డట్టు ఉంది’ అని అన్నారు.

 

వాషింగ్టన్‌లో మే 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని గవర్నర్‌ ఇన్‌స్లీ తెలిపారు. మిగతా రాష్ర్టాలతో పోలిస్తే న్యూయార్క్‌పై కరోనా ప్రభావం అధికంగా ఉన్నది. మహమ్మారి కారణంగా ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో 23,600 మంది చనిపోగా మరో మూడు లక్షల మందికి వైరస్‌ సోకింది. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థల్ని పునఃప్రారంభించడం, విద్యార్థులు వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కష్టమని భావించిన న్యూయార్క్‌ రాష్ట్ర గవర్నర్‌ ఆండ్య్రూ క్యూమో  ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

 

ఇదిలాఉండ‌గా, అమెరికాలో క‌రోనా క‌ల‌క‌లంతో బిలియనీర్లకు భయం పుట్టింది. బంకర్లలో తలదాచుకుంటున్నారు. భూమి లోపల నివాస యోగ్యంగా ఉండే స్థలాన్ని బంకర్‌ అంటారు. న్యూజిలాండ్‌లో విలాసవంతమైన బంకర్లు  అమ్మకానికి ఉన్నాయి. ఖరీదు రూ.22 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకూ ఉంటుంది. ‘రైజింగ్‌ ఎస్‌' అనే కంపెనీ భూమిలోపల ఆరు, ఏడు అంతస్తుల వరకు బంకర్లను నిర్మిస్తున్నది. ఒక్కో బంకర్‌లో 22 కుటుంబాల వరకు ఉండవచ్చు. కిచెన్‌, స్నానాల గది, స్విమ్మింగ్‌పూల్‌, జిమ్‌ వంటి వసతులు ఉంటాయి. టీవీ, ఇంటర్నెట్‌ సౌకర్యం కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: