దేశంగా కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా 40,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న 21 కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1082కు చేరింది. దేశవ్యాప్తంగా ఈ నెల 17 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. 
 
అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించే యోచనలో ఉన్నారని సమాచారం. రాష్ట్రంలో ఈ నెల 7తో లాక్ డౌన్ ముగియనుండగా 21వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న కేసీఆర్ ప్రగతి భవన్ లో లాక్ డౌన్ పొడిగింపు, ఇతర అంశాల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ను 21 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
అధికారులు రాష్ట్రంలో కొత్తగా కంటైన్మెంట్ జోన్లను గుర్తించారు. ఆ జోన్లలో క్వారంటైన్ గడువు ఈ నెల 21న ముగియనుంది. అందువల్ల 21వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించటానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. కేంద్రం మూడు రోజుల క్రితం లాక్ డౌన్ సడలింపులకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సడలింపుల గురించి కూడా సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. 
 
సీఎం కేసీఆర్ అధికారులను రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం వల్లే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. కేసులు తగ్గుతున్న సమయంలో నిర్లక్ష్యం వహించకూడదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: