దేశంలో కరోనా మహమ్మారి విజృంభణతో గత 40 రోజులుగా దేశవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించిపోయాయి. మద్యం దుకాణాలు మూతబడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేయడం వల్ల ఆర్థికంగా భారీగా నష్టపోయాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆరెంజ్, గ్రీన్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలను సడలించింది. ఈ జోన్లలో మద్యం దుకాణాలు ఓపెన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
లాక్ డౌన్ సడలింపుల వల్ల నేటి నుంచి ఏపీలో మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. అయితే జగన్ సర్కార్ నిన్న మధ్యాహ్నం 25 శాతం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలను భారీగా పెంచి మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 120 రూపాయల కన్నా తక్కువ ధర ఉన్న క్వార్టర్ బాటిళ్లలపై ధర 20 రూపాయలు పెరిగింది. 
 
హాఫ్ బాటిల్ పై 40 రూపాయలు పెరగగా, ఫుల్ బాటిల్ పై 80 రూపాయలు పెరిగింది. 120 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పలికే క్వార్టర్ బాటిళ్లపై 40 రూపాయల వరకు పెంచినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం మందుబాబులకు ఊహించని షాక్ ఇచ్చింది. మద్యం దుకాణాల యజమానుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నా వైన్ షాపుల ఓపెనింగ్ కు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 
 
ప్రభుత్వం మాస్క్ ధరించిన వారికి మాత్రమే మద్యం అమ్మాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేంద్రం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 40 రోజులుగా మద్యం దుకాణాలు మూతబడటంతో మందుబాబులు చాలా ఇబ్బందులు పడ్డారని వార్తలు వచ్చాయి. పలు మెట్రోపాలిటన్ సిటీల్లో లిక్కర్ మాఫియా ధరలు పెంచి మద్యాన్ని విక్రయించినట్టు ప్రచారం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: