క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి ఆర్థిక వ్య‌వ‌స్థ ఇప్ప‌ట్లో కోలుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ వ్యాపార రంగాలు స్తంభించిపోయాయి. దేశ జీడీపీ పాతాళానికి ప‌డిపోతుంద‌ని ప్ర‌పంచ బ్యాంక్ కూడా హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే ఉద్యోగాల కోత మొద‌లైంది. లాక్‌డౌన్ త‌ర్వాత అదిమ‌రింత ఎక్కువ‌గా ఉండ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈనేప‌థ్యంలో ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకోవ‌డానికి సుమారు సంవ‌త్స‌రం కాన్న ఏక్కువ స‌మ‌య‌మే ప‌డుతుంద‌ని అనేక కంపెనీల సీఈవోలు చెబుతున్నారు. ఈ ఏప్రిల్‌-జూన్‌లో ఏకంగా ఆదాయం 40 శాతం కోల్పోతామని సీఐఐ సర్వేలో అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల్లో కోతలు తప్పవని ఈ స‌ర్వేలో దాదాపు 50 శాతం సంస్థలు సంకేతాలివ్వడం గ‌మ‌నార్హం. ఇక ఈ 40 రోజుల లాక్‌డౌన్‌లో రోజుకు రూ.60 వేల కోట్ల నష్టం వచ్చినట్లు ఆర్థిక నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 300 మందికిపైగా సీఈవోలు తాజా సర్వేలో పాల్గొన్నారు. వీరిలో దాదాపు మూడింటా రెండు వంతుల మంది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు చెందినవారే కావ‌డం గ‌మ‌నార్హం. క‌రోనా దెబ్బ‌కు ఈ రంగాలు మొత్తం కుదేల‌య్యియి.

 

మార్కెట్‌ డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తి లేదని, దీనివల్ల భవిష్యత్‌ వ్యాపారం ప్రభావితం అయ్యే వీలుందని చాలా సంస్థలు ఆందోళన వెలిబుచ్చాయి. ఆదాయం సరిపడా లేక ప్రజల్లో కొనుగోళ్ల శక్తి కూడా మందగించే అవకాశాలున్నాయని ప్రతీ నాలుగు సంస్థల్లో మూడు అభిప్రాయపడ్డాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో 40 శాతానికిపైగా ఆదాయం కోల్పోతామని 33 శాతం సంస్థలు అంటుంటే.. 20 నుంచి 40 శాతం నష్టపోవచ్చని దాదాపు 32 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే.. కరోనా వైరస్ క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ అంటున్నారు. అయితే ఆర్థికంగా కుప్పకూలిన వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఉద్దీపనల కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఇక కేంద్రం ప్ర‌క‌టించ‌నున్న రెండో ఉద్దీప‌న ప్యాకేజీ కోసం ఈ సంస్థ‌లు ఎదురుచూస్తున్నాయి. ఈ ఉద్దీప‌న ప్యాకేజీని కేంద్రం త్వ‌రంలోనే ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: