లాక్ డౌన్ కార‌ణంగా నాలుక క‌రుచుకొనిపోయిన మందు బాబుల‌కు తీపిక‌బురు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. గ‌త కొద్దికాలంగా సాగుతున్న స‌స్పెన్స్‌కు తెర‌పెడుతూ... తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నిర్ణ‌యం తీసుకోనున్నార‌ట‌. దీనికి కార‌ణం వివిధ ర‌కాలైన ఒత్తిళ్లు. అదేంటి టీఆర్ఎస్ అధినేత ముందు ఒత్తిళ్లు ప‌నిచేయ‌వు క‌దా అనుకుంటున్నారా? అక్క‌డే ఉంది అస‌లు ట్విస్ట్‌.

 

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించడానికి ఒకరోజు ముందు నుంచే అంటే మార్చి 22 తేదీ నుంచే తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచే రాష్ట్రంలో మద్యం దుకాణాలను పూర్తిగా మూసేసింది. మందు బాబుల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా నిక్కచ్చిగా తన నిర్ణయాన్ని అమలుచేసింది. నిషేధాన్ని ఉల్లంఘించిన అనేక మద్యం షాపులను సీజ్‌ చేసింది. జరిమానాలు విధించింది. రాష్ట్రంలో ఎప్పుడో కనుమరుగైన గుడుంబా తయారీ ఇదే అదనుగా మళ్లీ మొదలైంది. మందుకోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న వారి బలహీనతను సొమ్ము చేసుకొనేందుకు గుడుంబా తయారీదారులు మళ్లీ గుడుంబాను ఏరులు పారించారు. ఈ ప‌రిస్థితి తెలంగాణ స‌ర్కారును షాక్‌కు గురిచేసింది.

 

ఇదే స‌మ‌యంలో తెలంగాణతో సుదీర్ఘ సరిహద్దు పంచుకుంటున్న మొత్తం మూడు రాష్ర్టాలూ సోమవారం నుంచి మద్యం షాపులను తెరవాలని నిర్ణయించాయి. ఆ రాష్ర్టాల్లో మద్యం దుకాణాలు తెరిస్తే, అది సరిహద్దులు దాటి, అక్రమ మార్గాలు, డొంకదార్ల గుండా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని స‌ర్కారు ఆందోళ‌న చెందుతోంది. మూడు రాష్ర్టాలతో సుదీర్ఘమైన సరిహద్దు ఉన్న దృష్ట్యా పొరుగు మద్యాన్ని మొత్తానికి మొత్తం రాకుండా ఆపడం అంత సులువుకాదు. అలా బ్లాక్‌మార్కెట్లో వచ్చేది అధిక ధరలకు అమ్ముడవుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రజల జేబులు గుల్ల కావడం ఖాయం. అంతే కాదు.. ప్రభుత్వం పెద్దఎత్తున ఆదాయాన్ని కోల్పోతుందని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో మందుబాబుల‌కు తీపిక‌బురు చెప్పేలా త్వ‌ర‌లో మ‌ద్యం స‌ర‌ఫరా ఉంటుంద‌ని పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: