దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తొలి కేసు నమోదైన రోజు నుంచి తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం ఎంతో కృషి చేస్తోంది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే బాధితులు ఆస్పత్రిలో చేరిన రోజు నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. లాక్ డౌన్ వల్ల రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా కరోన కట్టడి కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. 
 
ప్రభుత్వం కరోనా బాధితులకు కావాల్సిన భోజనం, మందులు, చికిత్స, మందులు, ఇతర ఖర్చుల కోసం ఒక్కోవ్యక్తిపై దాదాపు మూడున్నర లక్షలు ఖర్చు చేస్తోంది. ఖర్చుకు వెనుకాడకుండా కరోనా రోగుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ వారు ఆరోగ్యంగా ఇంటికి వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా ఒకసారి కరోనా పరీక్ష చేయడానికి 4500 రూపాయలు ఖర్చవుతుంది. 
 
కరోనా నిర్ధారణ అయితే వారికి రెండుసార్లు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్కరిపై ప్రభుత్వం 13,500 రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి దాదాపు 80 పీపీఈ కిట్లను ఉపయోగిస్తుంది. ఒక పీపీఈ కిట్ రెండోసారి వినియోగించటానికి పనికి రాదు. ఒక పీపీఈ కిట్ ధర 2500 రూపాయలు కాగా ఒక్కో రోగికి 80 పీపీఈ కిట్లను వినియోగిస్తే 2,00,000 రూపాయలు ఖర్చవుతుంది. 
 
కరోనా సోకిన వారికి రోగనిరోధక శక్తిని పెంచే మందులు, ఫ్లూయిడ్స్ కు 50,000 రూపాయలకు పైగా ఖర్చవుతోంది. కరోనా రోగులకు ప్రత్యేక మెనూతో కూడిన పౌష్టికాహారం అందజేయాల్సి ఉంటుంది. అల్పాహారం, భోజనం, డ్రై ఫూట్స్, వాటర్ బాటిల్స్, బ్రెడ్ కోసం 55,000 రూపాయలు ఖర్చవుతుందని సమాచారం. రోగులకు స్పెషల్ డ్రస్, శానిటైజర్, సబ్బుల కోసం 27,000 రూపాయలు, డిశ్చార్జ్ అయిన వారిని ఇంటికి చేర్చేందుకు 4,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని సమాచారం. రోగి కోలుకునే సమయాన్ని బట్టి ఈ ఖర్చు పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: