జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అనంతపురం జిల్లా జనసేన నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో పవన్ జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కరోనా సాధారణ జ్వరం అని మాట్లాడటం వల్లే కరోనా నివారణ చర్యల్లో అలసత్వం నెలకొని ఉంటుందని అన్నారు. పాలనా విభాగం వైఫల్యానికి జగన్ సర్కారే బాధ్యత వహించాలని చెప్పారు. 
 
తెలంగాణ మంత్రి రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకోకపోతే తమ పరిస్థితి కర్నూలు, గుంటూరులా అయిపోయేదని అన్నారని... ఆ మాటలను బట్టే ఏపీలో పరిస్థితి అర్థమవుతోందని చెప్పారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లు రెడ్ జోన్లుగా మారకుండా చేయడమే అసలు సవాల్ అని పేర్కొన్నారు. ఏపీలోని క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి ప్రభుత్వం సరైన సదుపాయాలు కల్పించటం లేదని... వారికి సక్రమంగా ఆహారం అందటం లేదని చెప్పారు. 
 
సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజా సమస్యలపై బలంగా మాట్లాడదామని పవన్ అన్నారు. కరువు ప్రభావిత జిల్లా అయిన అనంతపురం జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకునేంత వరకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని అన్నారు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. 
 
జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అనంతపురం జిల్లాలోని హిందూపురంలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని... జిల్లాలో రైతులు లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఉద్యాన పంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని... జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: