మందు బాబులది వేరే ప్రపంచం. వారి లోకమే వేరు. అక్కడ అంతా అనందమే. చిక్కులూ చికాకులూ అసలు ఉండవు. స్వర్గం అంటారు కదా...అది వాళ్ళ సొంతం. ఎంతో తపస్సు చేసుకుని పుణ్యం సంపాదిస్తే తప్ప లభించని స్వర్గం ఇలా మత్తు కళ్ళు మూసిన వెంటనే ఆవల నిలిచి ఉంటుంది. వలచి రమ్మంటుంది.

 

అందుకే మందు అంటే వారికి అంత ఇష్టం. అమ్రుత  భాండం అది. లాక్ డౌన్ వల్ల అది వారికి ఇన్నాళ్ళుగా  కరువు అయింది. దాంతో పిచ్చెక్కిపోయారు. మందు లేదని ఒకటిని పదిసార్లు నాలిక తడుపుకుని మరీ  ఇంట్లోనే ఎవరికీ కానివారు అయ్యారు. ఇపుడు ఎటూ స‌డలింపులు ఇచ్చేశారు. దాంతో పాటే మందు దుకాణాలు కూడా తెరిచారు. 

 

మందు కోసం ఇపుడు తాగుబోతులంతా రెండు మూడు మైళ్ళ దాకా క్యూలు కట్టేస్తున్నారు. మందు ధర ఎంత పెంచినా కొనేందుకు మేము రెడీ అంటున్నారు. వారి చేతుల్లో తళతళలాడుతున్న నోట్లను చూస్తే లాక్ డౌన్ వల్ల పేదరికం ఉందని ఎవరూ అనుకోవడం లేదు. నిజానికి నలభై రోజులుగా  పనులు లేవు. ఇంటి పట్టునే ఉంటున్నారు. అయినా సరే మద్యం బాటిల్ ని చూడగానే నోట్లు బయటకు వచ్చాయి.

 

మరి ఇంతలా మందుబాబుల వద్ద డబ్బు ఉంటే వారు పేదవారు ఎందుకు అవుతారు అని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అలాగే మేధావులు కూడా అడుగుతున్నారు. మందు బాబుల అధార్ కార్డుల ఆధారంగా వారందరికీ తెల్ల రేషన్ కార్డులు కట్ చేయమని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రజల పన్నులతో వచ్చిన ఆదాయం నుంచి పేదలకు తెల్ల రేషన్ కార్డుల పేరిట ప్రభుత్వాలు కోట్లలో ఖర్చు చేయడం కూడా దండుగ అంటున్నారు.

 

అందువల్ల తక్షణం ఇలాంటి వారి తెల్ల రేషన్ కార్డుని రద్దు చేయాలని కోరుతున్నారు. మరో వైపు చూసుకుంటే సామాజికవేత్తలు, స్వచ్చంద సంస్థలు కూడా నివ్వెరపోతున్నారు. తాము ఇంతకాలం సాయం చేసింది వీరికా అని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

లాక్ డౌన్ టైంలో ప్రతీ ఇంటికీ వెళ్ళి నిత్యావసరాలు సాయం చేశామని, ఇపుడు మందు షాపులు తెరవగానే ఒక్కసారిగా ఎగబడ్డారంటే మందు కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు చేయగలమని నోట్లు తీస్తున్నారంటే పేదలు వీరు కారు కదా అంటున్నారు. మొత్తానికి మందు బాబుల వీర విహారం యావత్తు సమాజాన్ని కొత్త ఆలోచనల్లో పడవేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: