ఆయన చంద్రబాబు. ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ.  ఆయన కనుక తలచుకుంటే మూడవ కన్నే తెరుస్తారు. అవసరం లేకపోతే ఉన్న రెండు కళ్ళూ మూసుకుంటారు. ఇక తన అసలైన రాజకీయం చేయాలనుకుంటే మాత్రం రెండు కళ్ళ సిధ్ధాంతాన్ని కూడా జనాలకు పరిచయం చేస్తారు. ఇపుడు మాత్రం బాబు ఒంటి కన్నే తెరచారు.

 

దాంతో ఆయన  చూపూ, ఊపూ అన్నీ ఏపీ మీదనే ఉన్నాయి. ఆయన ఉన్నది తెలంగాణాలో. అక్కడ విపక్షాలు కేసీయార్ సర్కార్ మీద ఇంతెత్తున ఎగురుతున్నాయి. అందరి సంగతీ ఎందుకు, చంద్రబాబుకు ఒకనాటి ప్రియశిష్యుడు. ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్ళిన రేవంత్ రెడ్డి కేసీయార్ సర్కార్ మీద గట్టిగానే మాట్లాడుతున్నారు.

 

ఇక పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి అయితే గవర్నర్ ని కలసి మరీ కేసీయార్ సర్కార్ మీద ఫిర్యాదు చేస్తున్నారు. తెలంగాణాలో కేసులు దాస్తున్నారని, చెప్పడం లేదని, ఎక్కువగా టెస్టులు చేయడం లేదని కూడా ఉత్తంకుమార్ రెడ్డి గట్టిగానే అరోపిస్తున్నారు. మరి ఇంత మంది ఇన్ని విధాలుగా ఆరోపణ చేస్తూంటే జాతీయ పార్టీ అధినేతగా చెప్పుకునే చంద్రబాబు తెలంగాణాలో ఉంటూ కూడా ఆ వూసు ఎత్తడంలేదు.

 

పోనీ విమర్శలు చేయనవసరం లేదు. తనకు ఉన్న అపారమైన అనుభవంతో కేసీయార్ కి సలహాలు ఇవ్వవచ్చు కదా. బాబుకు విపత్తులను ఎలా ఎదుర్కోవాలో అనుభవం ఉంది కదా దాన్ని కొంత పంచి తెలంగాణాను జీరో కరోన స్టేట్ గా చేసే పనిలో భాగం కావచ్చుగా. బొత్తిగా తెలంగాణానే బాబు మరచిపోయారు. ఆయన ఏపీ గురించే  ప్రతీ రోజూ మాట్లాడుతున్నారు. ఏపీలో జగన్నే రాత్రీ పగలు తలచుకుంటున్నారు.

 

మరి ఇంత ప్రేమ ఏపీ మీద ఉంటే ఇక్కడకు వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పవచ్చు కదా. తన తమ్ముళ్ల చేత సహాయ చర్యలు చేయాలని పిలుపు ఇవ్వవచ్చు కదా. అవి మాత్రం చేయరంతే. మొత్తానికి బాబుది ఇపుడు ఒంటి  కన్ను సిధ్ధాంతం అని వైసీపీ నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: