ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే.. తెలంగాణలో కరోనా అదుపులోకి వస్తున్నట్టు కేసుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఆ కేసుల సంగతి అట్లా ఉంచితే.. తెలంగాణలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న నాలుగు జిల్లాలో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా వైరస్ సోకుతున్న వారిలో, ఈ వైరస్ తో మరణిస్తున్న వారిలో అత్యధిక శాతం మంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్నమరో 3 జిల్లాల వారే ఉంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులే చెబుతున్నారు.

 

 

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం సడలింపులు ఇచ్చినా పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉంది. ఈ నాలుగు జిల్లాలతో పోలిస్తే.. మిగతా జిల్లాల్లో కేసులు బాగా తగ్గాయి. అక్కడ కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నిబంధనల సడలింపు అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో చర్చలు జరుపుతున్నారు.

 

 

ఈ నేపథ్యంలో సోమవారం మూడు కేసులు నమోదు కావడం, 40 మంది కోలుకుని డిశ్చార్జి కావడం శుభసూచకం. వైద్యశాఖ అధికారుల తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో ఇప్పటి వరకు 1085 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. వారిలో 585 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి అయ్యారు. 29 మంది మరణించారు. 471 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వైరస్ వ్యాప్తి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనే ఎక్కువ ఉంది.

 

 

మొత్తం 1085 పాజిటివ్ కేసుల్లో 717 మంది అంటే 66.08 శాతం ఈ నాలుగు జిల్లాలకు చెందిన వారే. మరణించిన వారిలో కూడా 82.21 శాతం మంది ఈ జిల్లాల వారే. గడిచిన 10 రోజుల్లో నమోదైన కేసుల్లో కూడా అత్యధిక శాతం మంది ఈ జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఈ జిల్లాల్లో పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. జనసాంద్రత ఎక్కువున్న ప్రాంతం కావడం వల్ల ఏమాత్రం పట్టు వదిలినా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: