దేశవ్యాప్తంగా కొన్ని షరతులతో లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. మార్చి 24న దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ ను ఇప్పటికే రెండు సార్లు పొడిగించారు. అయితే ఈ లాక్ డౌన్ పొడిగింపుపై అసలు జనం ఏమంటున్నారు.. ఈ విషయంపై తెలంగాణలో ఓ టీవీ ఛానల్ మరో సర్వే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో షాకింగ్ ఫలితాలు వెలువడ్డాయి.

 

 

తెలంగాణలో లాక్‌డౌన్‌ను కంటిన్యూ చేయాలంటూ 76 శాతం ప్రజలు తీర్పు చెప్పారు. మూడొంతుల మంది లాక్‌డౌన్‌ కొనసాగించాలనే చెప్పారు. లాక్‌డౌన్ వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా సరే లాక్ డౌన్ ఉంటేనే మంచిదని వారు అంటున్నారు. 24 శాతం మాత్రం లాక్‌డౌన్‌ను కంటిన్యూ చేయొద్దని అంటున్నారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో లాక్ డౌన్ కంటిన్యూ చేయమనే వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది.

 

 

జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ కొనసాగించాలంటూ 85 శాతం మంది తమ అభిప్రాయం తెలిపారు. కేవలం 15 శాతం మాత్రమే లాక్ డౌన్ ఎత్తేయాలని కోరారు. ఇక మెదక్ జిల్లాలో 71 శాతం కంటిన్యూ చేయాలని చెప్పారు. కరీంనగర్‌లో కూడా 76 శాతం లాక్‌డౌన్‌కే మొగ్గు చూపారు. నల్గొండ జిల్లాలో కూడా 77శాతం మంది కొనసాగించాలని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో 71 శాతం లాక్‌డౌన్‌ ఇలాగే ఉండాలని అభిప్రాయపడ్డారు.

 

 

దాదాపు అన్ని తెలంగాణ జిల్లాల్లోనూ ఇదే తరహాలో ఫలితాలు వచ్చాయి. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్నా.. లాక్ డౌన్ ఎత్తేస్తే ఎక్కడ కరోనా తమ వరకూ వస్తుందో అన్న భయాందోళనలు జనంలో కనిపిస్తున్నాయి. అందుకే ఇబ్బందులు పడుతున్నా సరే.. లాక్ డౌన్ ఉంటేనే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. ఉన్నచోట ఉండరా.. గంజి తాగి పండరా అన్న పాటను ఫాలో అవుతున్నారు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చన్న అభిప్రాయానికి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: