ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్లతో, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరేలా జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో రైతులు, మత్స్యకారులందరికీ మత్స్యకార భరోసా, రైతు భరోసా పథకాలు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 
 
రాష్ట్రంలో అర్హులందరికీ పథకాల అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో వివక్ష, అవినీతికి తావు లేకుండా చూడాలని సూచించారు. జగన్ సర్కార్ రాష్ట్రంలో రేపు మత్స్యకార భరోసా పథకం అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా జాలర్లకు 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ప్రభుత్వం నగదును నేరుగా మత్స్యకారుల ఖాతాల్లో జమ చేయనుంది. 
 
రైతు భరోసా పథకాన్ని రాష్ట్రంలో ఈ నెల 15న అమలు చేస్తారని వార్తలు వచ్చినా వివిధ కారణాల దృష్ట్యా ప్రభుత్వం మే నెల 30న ఈ పథకం అమలు చేయనున్నట్టు సమాచారం. ఈ పథకం ద్వారా రైతులకు 5500 రూపాయలు లబ్ధి చేకూరనుంది. సీఎం జగన్ ఈ పథకాలతో పాటు కరోనా గురించి, లాక్ డౌన్ నిబంధనల అమలు గురించి అధికారులతో చర్చలు జరిపారు. 
 
కరోనా పరీక్షల పరంగా ఏపీ దేశంలోనే తొలి స్థానంలో ఉందని అన్నారు. మిలియన్ జనాభాకు 2500కు పైగా కరోనా టెస్టులు చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్ల రూపంలో మనకు బలమైన నెట్‌వర్క్ ‌ఉందని చెప్పారు. రాష్ట్రంలో మరణాల రేటు 2 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామసచివాలయాల్లో కనీసం లక్షమందికి క్వారంటైన్‌ సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సీఎం తెలిపారు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: