గడచిన వారం పది రోజులుగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో నిన్న కేవలం మూడు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం లేదు. తెలంగాణ సర్కార్ కరోనాకు సంబంధించిన కొంత సమాచారం దాస్తోందని వైద్య బృందాలు కేంద్రానికి నివేదికలు ఇచ్చినట్లు రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. 
 
ఈ వార్తల గురించి తెలంగాణ సర్కార్ స్పందించాల్సి ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి పరీక్షలు ఎక్కువగా జరగడం లేదని... క్వారంటైన్ కేంద్రాల్లో రోగుల చికిత్సకు సంబంధించిన సమాచారం కూడా బయటకు తెలియడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అధికార పార్టీ వ్యతిరేకులు కొందరు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 
 
రాష్ట్రంలో సూర్యాపేటలో 80 కేసులు నమోదయ్యాయని... ప్రభుత్వం అక్కడ లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా... సెకండరీ కాంటాక్ట్ కేసుల కొరకు కరోనా పరీక్షలు నిర్వహించారా..? లేదా...? అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కొందరు అధికారులు మాత్రం ఎవరో ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. 
 
కరోనా రోగులతో కాంటాక్ట్ లో ఉన్నవారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని.... వారిలో లక్షణాలు కనిపిస్తే పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో కొంత భయాందోళన తగ్గింది. ఈరోజు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీ అనంతరం సీఎం లాక్ డౌన్ పొడిగింపు, మద్యం అమ్మకాల గురించి కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు.                          

మరింత సమాచారం తెలుసుకోండి: