వైసీపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు ఏపీ ప్రజలు రెండుసార్లు అధికారం ఇచ్చారని... చంద్రబాబు మాత్రం కనీస విశ్వాసం చూపించకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు ఏపీ ప్రజలను మాటలతోనే మానసికంగా కృంగదీస్తున్నారని చెప్పారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని ప్రతిరోజూ జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. 
 
కరోనాను కట్టడి చేయడంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన చంద్రబాబు నిత్యం రాజకీయాలే పరమావధిగా దిగజారి ప్రవర్తిస్తున్నారని అన్నారు. చంద్రబాబు వల్ల ఏపీ ప్రజలకు రాజకీయాలంటే అసహ్యం కలుగుతోందని అన్నారు. టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను క్షుద్ర కార్యక్రమాలకు చంద్రబాబు వినియోగిస్తున్నారని తెలిపారు. కేంద్రం దేశవ్యాప్తంగా మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. 
 
కేంద్రం ఆదేశాల మేరకే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మొదలయ్యాయని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రంలోని మద్యం దుకాణాలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ద్వారా తమ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి మాస్కులు పెట్టుకోకుండా క్యూ లైన్లలో నిలబడాలని, సామాజిక దూరం పాటించకుండా లైన్లలో నిలబడాలని చెప్పారని పేర్ని నాని ఆరోపణలు చేశారు. చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా రాష్ట్రంలో నిన్న ఉదయం మద్యం అమ్మకాలు మొదలైనప్పటి నుండి అధికార పార్టీపై విమర్శలు చేస్తోంది. దీంతో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి టీడీపీ దుష్ప్రచారాన్ని ఖండిస్తోంది. 

 
చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలను వారించాలని ఆయన కుటుంబ సభ్యులైనా చెబితే బాగుంటుందని అన్నారు. ఐదేళ్లు యువతకు ఐకాన్ గా చెప్పుకున్న లోకేష్ ఐనా తండ్రికి ఇలాంటి పనులు చేయవద్దని సూచించాలని పేర్కొన్నారు. చంద్రబాబు తన సొంత మీడియా ద్వారా జగన్ సర్కార్ పై విమర్శలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై నిందలేసే కార్యక్రమాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: