తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నెల 29 వ‌ర‌కూ లాక్ డౌన్ పొడ‌గిస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. కేంద్రం ఇచ్చిన గ‌డువుతో పాటుగా మ‌రిన్ని రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ కొన‌సాగుతుంద‌ని కేసీఆర్ తేల్చిచెప్పారు. అయితే, ఈ నిర్ణ‌యం వెనుక ఆస‌క్తిక‌ర కార‌ణం ఉంది. తెలంగాణ‌లో కరోనా కేసులు ఒక రోజు తగ్గడం, మరొక రోజు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగించడమే మంచిదని ఆరోగ్యశాఖ అభిప్రాయం వ్య‌క్తం చేసినట్లు సమాచారం.

 

వైరస్‌ను అదుపు చేసేందుకు కనీసం 70 రోజుల లాక్‌డౌన్‌ అవసరమని  పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా 70 రోజుల సైకిల్‌ పూర్తిచేయడమే సబబు అని ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ 70 రోజుల సైకిల్‌ సుమారుగా మే 28తో పూర్తవుతుంది. గతంలో స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులు సోకినప్పుడు కూడా  70 రోజుల సైకిల్‌ను పాటించినట్లు నిపుణులు చెప్పారు. ఆరోగ్యశాఖ సిఫారసు మీద మంగళవారం సమావేశమైన  రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా మార్చి 22న రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని మూడ‌వ విడ‌త కొన‌సాగిస్తూ ఈ నెల 29 దాకా లాక్‌డౌన్‌ను పొడిగించారు.

 

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న కేబినెట్లో ప్రగతిభవన్‌లో 7 గంటలపాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తదితర అంశాలు ఈ సమీక్షలో చర్చకు వచ్చాయి. సోమవారం రాష్ట్రంలో కేవలం 3 కరోనా పాజిటివ్‌ కేసులే నమోదవడం, 40 మంది కోలుకుని డిశ్చార్జి కావడం శుభసూచకమని సీఎం వ్యాఖ్యానించారు. అనంతరం వైద్యశాఖ అధికారులు తాజా పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అనంత‌రం కేబినెట్ నిర్ణ‌యం వెలువ‌డింది. కరోనా కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను అత్యంత కఠినంగా పూర్తిస్థాయిలో అమలు చేయ‌నున్న‌ట్లు సైతం వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: