తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. కొన్ని విషయాల్లో కేంద్రం మరీ బెల్లం కొట్టిన రాయిలా ఉంటుందని.. విమర్శించారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. వలస కూలీలను వారి స్వంత రాష్ట్రాలకు పంపించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మరీ నిర్దయగా వ్యవహరిస్తోందన్నారు. వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపించే రైళ్లలో కూడా చార్జీలు వసూలు చేయడం దారుణమన్నారు.

 

 

అసలు రైళ్లే నడవని పరిస్థితుల్లో రిజర్వేషన్ చార్జీలు వసూలు చేయడమేంటని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కనీసం వలస కూలీల కోసం రైలు చార్జీలు కూడా పెట్టుకోలేకపోతోందా.. ఆ మాత్రం కనికరం, సోయి కేంద్రానికి లేవా అని కేసీఆర్ మండిపడ్డారు. వలస కూలీల విషయంలో కనీస మానవత్వం ప్రదర్శించడం లేదంటూ కేసీఆర్ ఘాటుగా విమర్శించారు.

 

 

ఈ విషయంలో తాను దక్షిణ మధ్య రైల్వే అధికారులతోనూ మాట్లాడానని గుర్తు చేశారు. కానీ వారు మాత్రం తమ నిబంధనలకే కట్టుబడి ఉంటామని చెప్పారని కేసీఆర్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఈ ఉదయమే రైల్వేశాఖకు రూ. 4 కోట్ల రూపాయలు చార్జీల కోసం కట్టామని కేసీఆర్ తెలిపారు. వలస కూలీల విషయంలో కనీసం రైలు చార్జీలు కూడా మినహాయించలేని పరిస్థితుల్లో కేంద్రం ఉందా అని కేసీఆర్ నిలదీశారు.

 

 

నిజంగా కేసీఆర్ లేవనెత్తిన అంశం చాలా సమంజసమైంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వలస కూలీలు చిక్కుబడి పోయారు. తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు వారు పడుతున్న తపన కంటతడి పెట్టిస్తోంది.. కూడా .. ఇలాంటి సమయంలో వారిని రైల్వేల ద్వారా సొంత గ్రామాలకు చేర్చేందుకు కూడా కేంద్రం రైలు చార్జీలు వసూలు చేయడం అత్యంత దారుణమైన విషయం. ఇటీవల కేంద్రం బడాబాబుల వేల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ అభాగ్యుల కోసం మాత్రం కనీసం రైలు చార్జీలు పెట్టుకునే స్థోమత కూడా లేకపోయిందా అన్న విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: