‍‍‌( రూరల్‌ మీడియా సర్వే)

 

ఏపీలో ఎక్కడ చూసినా కిక్కు కోసం కిక్కిరిసిన జనం. 45 రోజులు గా ఉపాధి లేని పేద ల నుండి ఒక్కరోజులో 45 కోట్లను మద్యం పేరుతో వసూలు చేసింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో మే 4న రెడ్‌ జోన్‌లు తప్ప అన్ని చోట్ల వైన్‌ షాప్‌లు ఓపెన్‌ అవ్వడంతో రోడ్లన్నీ భారీ క్యూతో నిండి పోయాయి. దాదాపు 2100 షాపులు తెరుచుకోగా కోట్ల లో అమ్మకాలు జరిగాయని అంచనా.

 

 

ఈ నేపథ్యంలో, లాక్‌ డౌన్‌లో ఉండి ఇంకా కరోనా నుండి కోలు కోలేని సమయంలో మద్యం షాపులు తెరిస్తే, సమాజం పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? మహిళ లు,సామాజిక వేత్తలు,అద్యాపకులు,ఆలోచనాపరుల తో రూరల్‌మీడియా ఒక ర్యాండమ్‌ సర్వే నిర్వహించింది. దీనిలో భాగంగా సోషల్‌ మీడియాలో అభిప్రాయాల ను కూడా తీసుకుంది.

 

 

‘‘ దశల వారీగా మద్యపాన నిషేదంలో భాగంగానే మద్యం ధరలు పెంచారు. ధరలు పెంచితే పేదవాడు మద్యానికి దూరం అవుతారని ప్రభుత్వ ఆలోచన అయి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో బెల్ట్ షాపులు , వైన్‌ షాపు లు, బార్లను చాలా వరకు తగ్గించారు.’ అని విశాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సురేష్‌బాబు అంటారు.

 

 

‘‘ పనిలేకుండా ఆదాయం లేకుండా ఖాళీగా ఉన్న వారు తాగాలన్న కోరిక వల్ల ఎంతటి అఘాయిత్యాల కైనా ఒడి కట్టవచ్చు. కరోనా వైరస్‌తో సామాజిక దూరం పాటిస్తున్న మనం కిలోమీటర్ల కొద్దీ లైన్లో నిలబడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ తాగడం అనేది ఎంతటి ప్రమాదం కరం. మందు తెచ్చుకున్న వాడు బయట ఎక్కడా కూర్చోలేడు కాబట్టి ఇంటినే బార్‌గా మారుస్తాడు. దాంతో కుటుంబ కలహాలు ఏర్పడి, మానసిక అశాంతి పెరుగుతుంది. ఆరోగ్యం గురించి, ఆకలి గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఆదాయం కోసం ఇలాంటి పనులు చేయడం చాలా దుర్మార్గం. ’’ అంటారు సామాజిక,రాజకీయ విశ్లేషకుడు కండ్లగుంట శ్రీనివాస్‌.

 

 

‘‘ తిండికి లేక విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఉంటే మద్యం అమ్మకాలు చేస్తారా? వైన్‌ షాపు ముందు గుంపులు గా చేరితే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉంటుందా ? ’’ అని అనంతపురం జిల్లా , కదిరి ప్రాంత మహిళలలు అడుగుతున్నారు.

 

 

‘‘ మద్యనిషేధం వైపు అడుగులు వేసే ప్రభుత్వం ఇప్పుడు మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం లేదు. లాక్‌ డౌన్‌ కారణంగా ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఈ లాక్‌ డౌన్‌ ఎంత కాలం ఉంటుందో తెలియదు. ఉద్యోగాలు ఏమవుతాయో అనే భయం ఉంది. చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. ఎటుచూసినా చాలా మందిలో అభద్రతాభావం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మద్యం విక్రయాలు మొదలు పెడితే, షాపుల దగ్గర వ్యాధి సోకవచ్చు. అప్పుడు ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి జరిగే నష్టం అపారం. పైగా మద్యం సేవించాక ఇంట్లో గొడవలు జరిగే అవకాశం లేకపోలేదు.’’ అని ప్రముఖ ఆంగ్ల పత్రిక జర్నలిస్టు గోపి దార అంటున్నారు.

 

 

‘‘ లిక్కర్‌ షాపుల ముందు బారులు తీరిన క్యూలో నిబడిన ప్రతీ మనిషిలో చితికిపోయిన ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక వ్యవస్థను బాగుచేసే గొప్ప ఆర్ధికవేత్త కనిపిస్తున్నాడు. ఇపుడు కాకపోతే ఎప్పటికైనా మద్యం అమ్మాల్సిందే...ప్రభుత్వానికి ఆదాయం రావాలి కదా..?’’ అని కోనసీమ ప్రాంత వాసి అధ్యాపకుడు భాస్కర మీనన్‌ అన్నారు.

 

 

‘‘ మనం ఎప్పుడూ చూడని మానవసంకటంలో ఉన్నాం. మనిషిని మనిషి తాకితేనె ఏమయిపోతుందో అనే భయంతో బ్రతుకుతున్నాం. రేపు ఇంట్లోకి సరుకు లు కొనాలంటే డబ్బులు ఉన్నాయో లేదో వెతుక్కునే స్థితిలో ఉన్నాం.ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో,జీతం వస్తుందో లేదో సగం కోస్తారో అనే ఖంగారు లో ఉన్నాం. ఈ సమయంలో మందు కోసం జనం ఎగబడటం చూస్తుంటే...భయంగా ఉంది.. చిత్తూరులో పెళ్ళాం,కూతుర్ని ఒక తాగుబోతు చంపేశాడు. నిన్న ఒక్కరోజులో జరిగిన రోడ్డు ప్రమాదాు కూడా మద్యం వల్లనే.

 

 

ఈ మొత్తం ప్రహసనంలో కరోనా ఎంతమందికి వచ్చిందో అనేది 14రోజుల తరువాత మనకి తెలుస్తుంది.’’ అని సామాజిక విశ్లేషకుడు కత్తి మహేష్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

‘‘లాక్‌డౌన్‌ సమయంలో మద్యం షాపులు తెరవడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనం. మద్యం షాపుల వద్ద చాలా మంది బారులు తీరి ఉన్నారు, ఇక భౌతిక దూరం ఎలా పాటిస్తారు? ఇన్ని రోజులు గా లాక్‌డౌన్‌ అమలు కు సహకరించిన ప్రజల శ్రమ వృధా అవుతుంది. ఇప్పుడు మద్యం షాపు తెరవడం ద్వారా కుటుంబ కహాలు, ఘర్షణ లు మరింత పెరుగుతాయి.’’ అని డాక్టర్‌ నాగేశ్వరరావు హెచ్చరిస్తున్నారు.

 

 

‘‘ కరోనా ప్రభావంతో, ఆరోగ్యం కోసం ఉన్న జిమ్‌లు బంద్‌ చేశాం. పిల్లల భవిష్యత్‌ తో ముడిపడి ఉన్న స్కూల్స్‌ బంద్‌ పెట్టుకున్నాం. దేవుడి ఆలయాలు కూడా మూసుకున్నాం, కానీ ఇంత ప్రమాద కరమైన కరోనా ని కూడా లెక్క చేయ కుండా లిక్కర్‌ దుకాణాలు తెరవడం సమాజానికి ప్రమాదం’’ అని సామాజిక వేత్త చేగొండి చంద్రశేఖర్‌ అంటారు.

 

 

ఇవీ కొందరి అభిప్రాయాలు.. ఓవరాల్‌గా ప్రజల నుండి వచ్చిన కొన్ని ప్రశ్నలను ఇక్కడ వరుసగా ఇస్తున్నాం..

 

1, షాపుల దగ్గర ఎక్కడా కూడా సామాజిక భౌతిక దూరం పాటించడం లేదు. ఉదయం 7 గంట లకే మందు బాబులు మద్యం షాపు వద్ద గుంపులు గా చేరు తుంటే కరోనా వ్యాపించదా

2, జనం ఆకలి తీర్చడానికి ముందుగా తెరవాల్సింది అన్న క్యాంటీన్లని... మద్యం షాపుల్ని కాదు.

3, చేతు కడుక్కోవడం,మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం కరోనాకు సమాధానం. ఇప్పుడు ముందుచూపు లేకుండా లిక్కర్‌ షాపులు ఓపెన్‌ చేసి,ఇన్ని రోజుల కట్టడంతా మద్యం పాలు చేశారు

4, లాక్‌ డౌన్‌ కాలం లో మిగిలిన వందో, రెండొందలో మద్యం మీద ఖర్చుపెడితే కుటుంబం కూలిపోతుంది. ఇన్నిరోజు లాక్డౌన్‌ వల్ల మద్యం ప్రియులు తాగడం లేదు. పూర్తి నిషేధానికి ఈ కాలాన్ని ఒక ట్రయల్‌ పిరియడ్‌ గా ఉపయోగించుకోవాల్సిన ప్రభుత్వం జనం గొంతులో మద్యం పోయడం సమర్ధనీయం కాదు.

5, అమ్మఒడి పేరుతో అమ్మకు డబ్బులు ఇచ్చి, మద్యం షాపులు తెరవడం ద్వారా నాన్న నుంచి ఆ డబ్బును సర్కారు మళ్లీ వసూలు చేయడం న్యాయమా?

6, ‘‘సంపూర్ణ మద్య నిషేదం దిశగా...’’ అంటూ ఆంధ్రా సర్కారు చెపుతున్న మాటల్లో నిజాయితీ లేదు. కిరాణా షాపు 1 గంటకు మూసేసి మద్యం షాపు 7 గంటల వరకూ తెరిచి ఉంచడంలో చిత్తశుద్ధి కనిపించడం లేదు.

7, ఒక పిజ్జా డెలివరీ బాయ్‌ వల్ల కొందరికి కరోనా వచ్చిందని తెలిసి స్విగ్గీ,జోమాటో సర్విసెస్‌ ని కొన్ని చోట్ల ఆపారు. దానిని చూసైనా, మందు షాపుల్ని ఓపెన్‌ చేయకుండా ఉండాల్సింది.

8, లాక్‌ డౌన్‌ వల్ల ఉద్యోగ అవకాశాలు లేవు. కొనుగోలు శక్తి తగ్గింది. గృహహింస పెరిగింది. మహిళల పై ఇళ్లలో ఒత్తిడి పెరిగింది. ఇలాంటి టైంలో మద్యం అవసరమా ?

9, ఏకానమీని నిల బెట్టడానికి, జనాల్ని తాగించి పడుకోబెట్టడం కాదు. కరోనాని దృష్టిలో పెట్టుకుని ఆదాయవనరు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడమే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం.

10, ధరలు పెంచితే మద్యం తాగే వారు తగ్గి పోతారని అధికారపార్టీ మహిళా ఎమ్మెల్యే చెప్పడం తప్పు. ఆ డబ్బు కోసం వ్యసన పరులు ఏమైనా చేస్తారు...

11, కరోనా వచ్చి చనిపోతారో లేదో తెలియదు గాని మద్యం లేక చాలా మంది చనిపోయారని కొందరు చెబుతున్నారు. మద్యం దుకాణాలు తెరచుకోవడంతో కొత్త ఉత్తేజం, కొత్త శక్తి వచ్చిందంటున్నారు. ధర ఎంత పెరిగినా పర్వాలేదు మద్యం దొరికితే చాలు అని వారు తేల్చి చెప్పారు.

12, మందు షాపుల చుట్టూ జరుగుతున్న రచ్చతో, ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోకపోతే, మద్యం వల్ల వచ్చే ఆదాయం సంగతి ఎలా ఉన్నా.. ముందు కరోనా విస్తరణతో వైద్యరంగం మీద, ప్రజారోగ్యం మీదపడే భారం ఎక్కువ ఉంటుంది.

13, ఒక సారి మత్తులోకి వెళ్లాక , బౌతిక దూరం పాటించ కలుగుతారా? ఆదాయాలే లేక జీవితాలే చితికి పోతున్న సమయంలో ఉన్న కొద్ది డబ్బులే మద్యానికి ఖర్చు పెడితే ఆ కుటుంబాలు ఏమవుతాయి ?

14, ప్రజలకు అవసరమైనవి అనేకం ఉండగా ముందుగా మద్యం షాపులు ఎందుకు తెరవాలి? ఇన్ని రోజులు మద్యం లేకుండా అల వాటు పడి పోయారు. ఇపుడిపుడే వారి శరీరాలు మనసు కూడా కుదుట పడుతున్న దశలో లిక్కర్‌ తెరవడం అన్యాయం కాదా ?

 

సర్వే ఫలితాలు ఇవి...

 

విశాఖ,ఉభయ గోదావరి, రాయసీమలో వివిధ వర్గాలకు చెందిన 120 మంది తో మాట్లాడినపుడు ఎక్కువ శాతం లిక్కర్‌ షాపులు ఓపెన్‌ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

 

ప్రపంచ ఆరోగ్య సంస్ధ, వైద్యులు చెబుతున్న సూచను పాటించకుండా మద్యం షాపుల ముందు గుంపు లు పెరగడం వల్ల ఇన్ని రోజు లాక్‌డౌన్‌ వృధా అయ్యే అవకాశం ఉంటుందని 70 మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆదాయమే కావాలనుకుంటే, మద్యాన్ని డోర్‌ డెలివరీ చేయ వచ్చని30 మంది సూచించారు, మద్యం వ్యసనం ఉన్నవారు మందు లేక పోతే ఉండలేరని, ప్రభుత్వం అమ్మకాలు చేపట్టడం పట్ల సానుకూలంగా 20 మంది స్పందించారు.

 

కరోనా దెబ్బతో కుప్ప కూలు తున్న ఆర్ధిక వ్యవస్ధలో పేద కుటుంబాలు శ్రమజీవులు మరింత చితికి పోవాలా ? అనే అభిప్రాయాలే ఈ సర్వేలో ఎక్కువగా వెల్లడయ్యాయి.

 

ఈ సందర్భంగా సామాజిక మీడియాలో అందరినీ ఆలోచింప చేస్తూ, ప్రాచుర్యం పొందుతున్న ఒక ప్రశ్న ఇది...

 

‘‘ నేను ఉన్న ప్రాంతంలో ఒక బ్రాందీ షాపు జనంతో కిటకిటలాడేది, నాకు తెలిసిన మనుషులు తెలియని మనుషులు అక్కడ తాగుతూ కనబడేవారు, నాకు తెలిసిన మనుషులు సంవత్సరానికి నలుగురు చొప్పున నాకు కనపడకుండా పోయేవారు, ఇది ఆ ఒక్క బ్రాందీ షాపు లెక్క మాత్రమే, ఇప్పుడు వచ్చిన కరోనా వల్ల నాకు తెలిసిన మనుషులు ఒక్కరు కూడా దూరం కాలేదు, ఇప్పుడు నేను కరోనాని ద్వేషించాలా?, వైన్‌ షాపుల ను ద్వేషించాలా..?

 

- శ్యాంమోహన్‌, (రూరల్‌ మీడియా) 9440595858

 

మరింత సమాచారం తెలుసుకోండి: