తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడచిన వారం రోజులుగా రాష్ట్రంలో 20 లోపే కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినా గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ నమోదవుతున్న కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధికే చెందినవి కావడం గమనార్హం. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగం కేసులు హైదరాబాద్ నగరంలోనే నమోదయ్యాయి. 
 
దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో కరోనాను కట్టడి చేసేందుకు బల్దియా రంగంలోకి దిగింది. హైదరాబాద్ నగరంలో చార్మినార్ జోన్ లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 332 కేసులు నమోదు కాగా చార్మినార్ పరిధిలోనే 219 కేసులు నమోదు కావడం గమనార్హం. అధికారులు ఇక్కడ 52 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. 
 
ఎల్బీనగర్ జోన్ లో 16 కేసులు నమోదు కాగా 14 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. అధికారులు కంటైన్మెంట్ జోన్లలో రెండుసార్లు శానిటైజ్ చేసేలా చర్యలు చేపట్టటంతో పాటు ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య స్థితిని తెలుసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి వెంటనే పరీక్షలు చేసి కరోనా సోకిందో లేదో నిర్ధారిస్తున్నామని చెబుతున్నారు. 
 
మరోవైపు రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 11 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 1096కు చేరింది. ఇప్పటివరకూ తెలంగాణలో 29 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటన చేశారు. రెడ్ జోన్ ప్రాంతాలలో లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలవుతాయని చెప్పారు. ఈ నెల 15వ తేదీన మరోసారి సమావేశం ఏర్పాటు చేసి రెడ్ జోన్ ప్రాంతాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: