ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 67 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1717కు చేరింది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యే సమయంలో కరోనా విజృంభించడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. 
 
తెలంగాణ సర్కార్ ఈ నెలలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటన చేయగా ఏపీ ప్రభుత్వం గతంలోనే లాక్ డౌన్ ఎత్తివేసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటన చేసింది. ఏపీ సర్కార్ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను డైరెక్ట్ గా ప్రమోట్ చేసింది. అయితే తాజాగా ప్రభుత్వం నుంచి పదో తరగతి పరీక్షల గురించి స్పష్టత వచ్చింది. కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 17న ముగియనుండటంతో ఏపీ సర్కార్ జూన్ తొలి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. 
 
ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అధికారులు ఇప్పటికే షెడ్యూల్ ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. జగన్ సర్కార్ ఇప్పటికే పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఇందులో భాగంగా ఒక గదిలో కేవలం 12 మంది విద్యార్థులు పరీక్షలు రాసేలా చర్యలు చేపట్టనుందని సమాచారం. 
 
ఒక విద్యార్థికి మరొక విద్యార్థికి ఆరడుగుల దూరం ఉండటంతో పాటు ఒక్క్ బెంచ్ కు ఒక విద్యార్థి మాత్రమే కూర్చునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం పలు మార్గదర్శకాలను పాటించనుందని సమాచారం. కరోనా విజృంభిస్తూ ఉండటంతో ఏపీలో ఆగష్టు నెల 1వ తేదీ నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: