తెలంగాణ రాష్ట్రం ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ధనసిరి సీతక్క ప్రస్తుతం అందరి మన్ననలను పొందుతున్నారు. ఆమె గొప్ప మనస్తత్వం గురించి ఇప్పటికే ఎన్నో వార్తా కథనాలు వెల్లువెత్తాయి. వాస్తవానికి సీతక్క తన 20 సంవత్సరాల వయసులోనే దట్టమైన అడవుల్లో గన్ను పట్టి నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు.


తను ఓ సందర్భంలో మాట్లాడుతూ... ' నేను గన్నుతో(మావోయిస్టు) ఉన్నా... గన్ మెన్ తో(ఎమ్మెల్యే) ఉన్నా అది కేవలం అణగారిన వర్గాలకు కూడు, గుడ్డ, గూడు కల్పించడం కోసమే' అని చెప్పుకొచ్చారు. తాను ఆ మాటనే తన 20ఏళ్ళ వయసు నుండి తూచా తప్పకుండా పాటించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ని కట్టడి చేసేందుకు నెల రోజులకు పైగా భారతదేశంలో లాక్ డౌన్ ఆంక్షలను విధిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం.


తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుగానే 47రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. దీంతో ఆ రాష్ట్రంలోని పేద ప్రజలు ఉపాధి కోల్పోయి నిత్యావసర సరుకులు కొనుక్కోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి అండగా అనేకమంది నిలుస్తున్నారు. ఈ కోవలో ఎమ్మెల్యే సీతక్క ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నతమైన ఎమ్మెల్యే స్థాయిలో ఆమె ఉన్నప్పటికీ... ప్రతిరోజు ఉదయం నిద్ర లేసినంతరం తన నియోజకవర్గంలోని ఏ సదుపాయం లేని గిరిజన కుటుంబాల వద్దకు వెళ్లి అందరినీ మనసారా పలకరిస్తూ తన చేతి నుండి నూనె, బియ్యం, కూరగాయలను గుడ్లను ఇంకా ఇతర నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. విశేషం ఏమిటంటే రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుండి ఆమె ఇప్పటి వరకు గిరిజన ప్రజలకు నిత్యావసర సరుకుల అందించడమే దినచర్యగా అలవర్చుకున్నారు.


గిరిజనులు ఉండే ప్రదేశానికి వెళ్లాలంటేనే కష్టంతో కూడుకున్న పని. అస్సలు వెళ్లేందుకు రహదారులు సరిగ్గా ఉండనే ఉండవు. ద్విచక్ర వాహనాలు కూడా ప్రయాణించే లేని మార్గాలలో ఎమ్మెల్యే సీతక్క నడుచుకుంటూ వెళ్లారంటే... అది నిజంగా ఆమెను మెచ్చుకోదగ్గ విషయమే.


వాజేడు మండలంలోని పొనుగోడు గ్రామంలో గిరిజనుల కోసం నిత్యావసర సరుకులు అందించడానికి ఆమె కూరగాయల బస్తాని తన తలపై వేసుకొని నడిచారు. ప్రభుత్వాలు అందించే నగదు సహాయం, రేషన్ బియ్యం లభించడం దాదాపు అసాధ్యం. ఈ విషయం గురించి తాను మాట్లాడుతూ... రేషన్ కార్డు, జన్ ధన్ ఖాతా, బ్యాంకు అకౌంట్స్, ఆధార్ తో లింక్ అప్ కానీ బ్యాంక్ అకౌంట్లు లేని వారిలో ఎక్కువగా గిరిజనులే ఉంటారు. అటువంటప్పుడు ప్రభుత్వం నుంచి అందించే సహాయం వారికి లభించడం ఒక బ్రహ్మ అని చెప్పుకోవచ్చు. లాక్ డౌన్ కారణంగా వారపు సంతలు నిలిచిపోయాయి. దాంతో గిరిజనులు నిత్యావసర సరుకులు దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారు అని ఆమె చెప్పుకొచ్చారు.


ఈ క్షణం వరకూ సీతక్క తన నియోజకవర్గంలోని ఏటూరునాగారం, తాడ్వాయి, వెంకటాపురం గోవిందరావుపేట, మంగపేట తదితర గ్రామాల్లో ప్రతిరోజు తిరుగుతూ నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. కానీ ఇవన్నీ చేస్తున్న ఆమె మాత్రం ఎటువంటి హంగు ఆర్భాటాల జోలికి వెళ్లడం లేదు. ఒక్క అరటి పండు ఇచ్చి పది ఫోటోలు దిగే రాజకీయ నేతలున్న నేటి సమాజంలో... ఎంతో సహాయం చేస్తూ కూడా ఒక్క ఫోటో కూడా దిగకుండా సీతక్క చాలా నిరాడంబరంగా ఉండటం ఆశ్చర్యకరమైన విషయమే. అందుకే ఈ వారం ఎమ్మెల్యే సీతక్క ని హెరాల్డ్ విజేత గా ప్రకటిస్తున్నాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: