భారత్ లో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 50,000కు చేరువలో ఉంది. మృతుల సంఖ్య 1,600 దాటింది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల నుంచే అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే కేసుల సంఖ్య ఇంత భారీగా పెరగడానికి అసలు కారణాలు తెలిసి వైద్యులే షాక్ అవుతున్నారు. 
 
చాలా మంది కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్లే భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. చాలామంది జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే టాబ్లెట్లు వేసుకుంటున్నారని... వీరి నిర్లక్ష్యం వల్ల చాప కింద నీరులా వైరస్ వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో వెలుగు చూసిన కేసుల్లో ఈ తరహా కేసులే ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. 
 
చాలమంది అస్వస్థతకు గురైన వెంటనే టాబ్లెట్లు వాడటంతో కరోనా లక్షణాలు ఉన్నా బయటకు కనిపించడం లేదు. వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు వైరస్ సోకుతోంది. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలోని మేడిపల్లిలో కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తికి కరోనా సోకడంతో అతని కుటుంబంలోని ఏడుగురికి కూడా కరోనా నిర్ధారణ అయింది. 
 
దిల్ సుఖ్ నగర్ లో ఒక వ్యక్తి జ్వరం వస్తే సమీపంలోని మెడికల్ షాపులో మందులు కొనుక్కుని వేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. అధికారుల విచారణలో అ వ్యక్తి నుంచి 11 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇలా నిర్లక్ష్యం వల్లే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: