ప్రధాని నరేంద్ర మోడీ తెలివైన ప్రధాని. రాజకీయంగా గట్టి నేత. వ్యూహాలు రూపొందించడంతో దిట్ట. కరోనా విపత్కర పరిస్థితులను సైతం తనకు అనుకూలంగా చేసుకున్న జగజ్జేత. అటువంటి మోడీ లాక్ డౌన్ని ముచ్చటగా మూడవసారి ప్రకటించారు. కానీ ఆ తరువాత ఏంటి అన్నది మాత్రం  ఎవరికీ ఎక్కడా చెప్పడంలేదు.

 

అన్నీ మూసుకుని కూర్చున్న రాష్ట్రాలకు తెరువు, బతుకు తెరువు కూడా కేంద్రం చూపించాలి. కానీ మోడీ మాత్రం మౌన ముని అయిపోయారు. రాష్ట్రాలకు ఈ సమయంలో ఆదాయం ఏదీ లేదు. కేంద్రం వద్ద అధికారాలు ఉన్నాయి. ఏదో విధంగా ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి. కానీ ఏమీ కాకుండా రాష్ట్రాలు  బీదగా మిగిలిపోయాయి. మరి మోడీ కరుణించడంలేదు, కనికరించడంలేదు

 

అసలు మోడీ ఉద్దేశ్యం ఏంటి, ఓ వైపు ఆర్ధిక వేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు. ఆర్ధిక కార్యకలాపాలు ముమ్మరం కావాలంటే ప్రజల వద్ద డబ్బు ఉండాలి. అందువల్ల వారికి డబ్బులు నేరుగా ఇవ్వలని అంటున్నారు. అలాగే రాష్ట్రాలను ఆదుకోవాలని, ప్రత్యెక ప్యాకేజీలు ప్రకటించాలని కూడా డిమాండ్  చేస్తున్నారు.

 

మరో వైపు చూసుకుంటే సీపీఐ లాంటి పార్టీలు కూడా కేంద్రం రాష్ట్రాలను ఆదుకునేందుకు పది లక్షల కోట్లతో భారీ ప్యాకేజి రూపొందించాలని డిమాండ్ చేస్తోంది. ఇక ఇంకోవైపు చూసుకుంటే హెలికాప్టర్ మనీని విడుదల చేయాలని కేసీయార్ కోరుతున్నారు. కొత్తగా నోట్లు ముద్రించి అన్ని రాష్ట్రాలకు పంచాలని కూడా ఆయన కోరుతున్నారు. లేకపోతే నిబంధలను రూల్స్ సడలిస్తే తాము పోయి ఎక్కడైనా అప్పులు తెచ్చుకుంటామని కూడా చెబుతున్నారు.

 

కానీ మోడీ మాత్రం కిమ్మనడంలేదు. అసలు  కేంద్రం ఉద్దేశ్యం ఏంటి అన్నది అందరికీ అర్ధం కావడంలేదు. ఓ వైపు దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.  ఇంకోవైపు చూసుకుంటే దేశంలో నిరుద్యోగం పేదరికం పెరిగిపోతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ విషయంలో మోడీని నిలదీస్తున్నారు. కానీ మోడీ మాత్రం మాట్లాడడం లేదు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు,  ఏం అనుకుంటున్నారు.

 


ఓ వైపు కరోనా కోరలకు చిక్కి దేశం విల‌విలలాడుతోంది. ఇపుడు ఆర్ధిక సమస్యలతో రాష్ట్రాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. వాటిని అలాగే బిగించేసి మోడీ చోద్యం చిత్తగిస్తారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.  ఏది ఏమైనా కరోనా మహమ్మారి అదుపులోకి వస్తే జాతీయస్థాయిలో  అసలైన రాజకీయం ఉంటుందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: