తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా విష‌యంలో కేంద్రంతో సంబంధం లేకుండా లాక్ డౌన్ తేదీల‌ను పొడ‌గించిన తెలంగాణ సీఎం ఇదే ఒర‌వ‌డిలో మ‌రో కీల‌క అడుగు వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

 

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్ అమలు, సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా  హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలుకు సరిహద్దులో గల గ్రామాల్లో, గుంటూరు జిల్లాకు సరిహద్దులో గల గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. “హైదరాబాద్ దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. కాబట్టీ అధికారులు హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరిపి అవసరమైతే చికిత్స చేయించాలి. ఎవరు పాజిటివ్ గా తేలినా అతను కలిసిన వారందరినీ క్వారన్ టైన్ చేయాలి. హైదరాబాద్ లోని వారు బయటకు పోకుండా, బయటివారు హైదరాబాద్ లోనికి రాకుండా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలి. చురుకైన పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐఎఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలి. మొత్తం హైదరాబాద్ ను చుట్టుముట్టాలి. వైరస్‌ను తుదముట్టించాలి ” అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

 

ఈ సంద‌ర్భంగా పొరుగున ఉన్న ఏపీ గురించి సీఎం కేసీఆర్ ఉద‌హ‌రించారు. “పక్క రాష్ట్రంలోని కర్నూలు పట్టణం, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వాటికి సరిహద్దుల్లోనే తెలంగాణ గ్రామాలున్నాయి. ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలి. అటువారెవరు ఇటు రాకుండా, ఇటువారెవరు అటు పోకుండా నియంత్రించాలి. వైరస్ మన దగ్గర పుట్టింది కాదు. ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందేదే. కాబట్టీ ప్రజల రాకపోకలను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చు” అని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: