తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాలు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే ధ‌ర‌ల పెంపుపై ప‌లు వ‌ర్గాలు నిర‌స‌న వ్య‌క్తం చేశాయి. ఈ నేప‌థ్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ భవన్ లో ఉన్నతాధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. వివిధ అంశాల‌ను స‌మీక్షించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యం నిల్వలు తగినన్ని ఉన్నాయని, మద్యం కొరత ఏర్పడే అవకాశం లేదన్నారు. వైన్ షాపుల దగ్గర భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

 

పెరిగిన ధరలకే ఇవాళ మద్యాన్ని అమ్మిన‌ట్లు మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ వెల్ల‌డించారు. ప‌క్క రాష్ట్రాలు ధరలను 75 శాతం పెంచడంతో తప్పని పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కూడా 16 శాతం వరకు ధరలను పెంచాల్సి  వచ్చిందని తెలిపారు.నిబంధనలను పాటించని  28 షాపులపై కేసులు నమోదు చేసి, లైసెన్స్ రద్దు చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో మద్యం లభించకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం కూడా వచ్చిందని  మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలు ముందుగానే లిక్కర్ షాపులు తెరిచాయన్నారు. మద్యం అందుబాటులో లేకపోవడంతో గుడుంబా మళ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వీటన్నింటిపై మంత్రులు, ఉన్నతాధికారుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే లిక్కర్ షాపులను తెరవాలని నిర్ణయించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

 

ఇదిలాఉండ‌గా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ఈ నెల 29 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆరెంజ్ జోన్లో ఉన్న కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను నగర పాలక సంస్థ అధికారులు అనుసరిస్తున్నారు . షాపులను తెరిచేందుకు సరి-బేసి సంఖ్య విధానాన్ని అమలు చేయనున్నట్లు…నగరపాలక సంస్థ కమిషనర్ వల్లూరి క్రాంతి తెలిపారు. నగరంలోని మొత్తం షాపులను ‘ఏ, ‘బీ‘, ‘సీ‘..మూడు కేటగిరీలుగా విభజించినట్టు చెప్పారు.కేటగిరి ‘ఏ’ లో నిత్యావసర, మద్యం, నిర్మాణ రంగానికి సంబంధించిన షాపులు ఉన్నాయి. వీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు వీటిని తెరచుకోవచ్చని  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: