మరణాలు పెరిగినా ఆంక్షల్ని సడలించక తప్పదు.. ఇదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్న మాట. కరోనా ప్రభావం ఎలా ఉన్నా.. ఎకానమీని పట్టాలెక్కించటమే టార్గెట్ అంటున్నారు. ఓ పక్క కరోనా మరణాలు లక్షచేరే దిశగా పెరుగుతున్నాయి. మరోపక్క అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అతలాకుతమవుతోంది. 

 

కరోనా కబళించటంతో అనేక ప్రపంచ  దేశాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమై... ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడుతున్నాయి. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆంక్షల సడలింపుకు తొందర పడితే మరణాలు పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కానీ ఈ సూచనలు పక్కనపెడుతున్నాయి కొన్ని దేశాలు.

 

ప్రపంచ ఎటుపోయినా, ప్రజలు ఏమైపోయినా అనుకున్నది చేసి తీరతానంటారు ట్రంప్. ఇప్పుడు కరోనా అమెరికాలో వేలాది ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే 70వేలు దాటిన మరణాలతో అతలాకుతలమవుతోంది. ఈ పరిస్థితుల్లో మరికొంత కాలం లాక్ డౌన్ అమలు చేయటం అవసరమనే వాదనలు పెరుగుతున్నాయి. కానీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే లాక్డౌన్ ఎత్తేయాల్సిందే అంటున్నారు.  మరణాలు పెరుగుతాయని ట్రంప్ స్వయంగా చెబుతూనే ఆర్థిక వ్యవస్థనూ తెరవాల్సిన అవసరం ఉందంటున్నారు. 

 

అమెరికాలో ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్లకు పైగా ప్రజలు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు దారుణంగా పడిపోతోందని అంచనాలు చెప్తున్నాయి. ఆల్రెడీ మొదలైన గడ్డుకాలం రాబోయే రెండేళ్ల పాటు ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో కరోనాకు బలవుతున్న వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలో ట్రంప్‌ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.



మరోవైపు అమెరికాలో కరోనా ఈ స్థాయిలో ఉన్నా ట్రంప్‌ మాస్క్‌ ధరించటం లేదు. ఫీనిక్స్‌ లోని హనీవెల్ ఫ్యాక్టరీని మంగళవారం ట్రంప్ సందర్శించారు. లాక్‌ డౌన్‌ విధించిన తర్వాత ఆయన తొలి పర్యటన ఇదే. అయితే అక్కడ ఆయన మాస్క్ ధరించడానికి కూడా ఆయన నిరాకరించారు. గతవారం ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సైతం ఓ పర్యటనలో మాస్కు ధరించకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

 

ఇక అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌ కు స్వస్తి పలికే సూచనలు కనిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఆ బాధ్యతల్ని సంబంధిత సంస్థలకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో కరోనా పోరు రెండోదశకు చేరుకుందని, క్రమంగా కేసుల్నితగ్గిస్తూ, ఎకానమీని పునరుద్ధిరించాల్సిన అవసరం ఉందని ట్రంప్ భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: