అంద‌మైన స‌ముద్ర‌తీరం.. ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంతో నిత్యం అల‌రారే విశాఖ‌..నేడు దుఃఖ‌సాగ‌రంలో మునిగిపోయింది. తెల్ల‌వారుజామున‌ గాఢ‌నిద్ర‌లో ఉన్న విశాఖ‌పై  ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్‌ లీకేజీ రూపంలో మృత్యువు చేసిన దాడితో భ‌యాన‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎటుచూసినా హృద‌య‌విదార‌క దృశ్యాలే..! దారిపొడ‌వునా స్పృహ‌త‌ప్పిప‌డిపోయిన జ‌నాలే..! ఎవ‌రిని ప‌ల‌క‌రించినా క‌న్నీళ్లే..! ఏం జ‌రుగుతుందో తెలియ‌దు..! ఊపిరి ఆగిపోతోంది..! నోటి నుంచి నుర‌గ‌లు.. ముక్కు నుంచి ర‌క్తం..! తెల్ల‌వారు జామున‌ ఒక‌రికొక‌రు సాయం చేసుకునే అవ‌కాశం లేదు..! ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ఎవ‌రికివారుగా ప‌రుగులు తీస్తూ దారిపొడ‌వునా ప‌డిపోయారు. మ‌రికొంద‌రు బావులు, మురికి కాలువ‌ల్లో ప‌డిపోయి ప్రాణాలు కోల్పోయారు! ప‌రుగులు తీసే క్ర‌మంలో వెంక‌టాపురం గ్రామంలో గంగ‌రాజు అనే వ్య‌క్తి నేల‌బావిలో ప‌డిపోయి చ‌నిపోయాడు. ఊపిరాడ‌క ఉక్కిరిబిక్కిర‌వుతున్న‌ పిల్ల‌ల‌ను చూసి త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లిపోయారు..! ఇక ఇళ్ల‌లో ఉన్న వృద్ధులు న‌డ‌వ‌లేక‌, అడుగుతీసి అడుగువేయ‌లేక త‌రుముకొస్తున్న మృత్యువు నుంచి దూరంగా పారిపోలేక‌ ఇంట్లోనే కుప్ప‌ కూలిపోయారు.

 

ఇక కొట్టాల్లో గుంజ‌ల‌కు క‌ట్టేసి ఉన్న ప‌శ‌వులు అలాగే ప్రాణాలు వ‌దిలాయి. ప‌చ్చ‌ద‌నంతో కళ‌క‌ళ‌లాడిన ప్రాంతం ఒక్క‌సారిగా మాడిపోయింది. ప‌చ్చ‌నిచెట్లు మాడిపోయాయి. విశాఖలోని గోపాలపట్నం పరిధి ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ గ్యాస్ లీకేజీతో చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు త‌ల్ల‌డిల్లిపోతున్నాయి. వెంట‌నే అప్ర‌మ‌త్తం అయిన అధికార యంత్రాంగం.. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి కేజీహెచ్‌, త‌దిత‌ర ఆస్ప‌త్రుల్లోకి బాధితుల‌ను త‌ర‌లించి చికిత్స అందిత‌స్తున్నారు. ఇప్ప‌టికే సుమారు ప‌దిమంది వ‌రకు మృతి చెందిన‌న‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ గ్యాస్‌తో కంపెనీకి దాదాపుగా రెండు మూడు కిలోమీట‌ర్ల దూరంలోని ప‌చ్చ‌ని చెట్ల‌న్నీ మాడిపోయాయి. దాదాపుగా ఈ గ్యాస్ ప్ర‌భావం సుమారు 48గంట‌ల‌పాటు ఉంటుంద‌ని అధికార‌వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని చెబుతున్నారు. వేలాది ప‌శువుల మృత్యువాత‌తో రైతులు తీవ్ర న‌ష్ట‌మే జ‌రుగుతుంద‌ని, వ్య‌వ‌సాయ‌ప‌నుల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ ప‌రిణామాలు రైతుల‌ను మ‌రింత క‌ష్టాల్లోకి నెడుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: