దేశంలో కరోనా కట్టడి ఇంకా జరగలేదని.. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చేవారికి తప్పని సరి పరీక్షలు చేసి.. 14 రోజుల పాట క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుండి వచ్చే వారిని తప్పనిసరిగా 14రోజుల పాటు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉంచాలని,ఇతర జిల్లాల నుండి వచ్చే వారిని కమ్యునిటీ క్వారంటైన్ కేంద్రాలలో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై బుధవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా సిఎస్ వలస కార్మికులు తరలింపు విషయమై మాట్లాడుతూ ఇతర జిల్లాలు, రాష్ట్రాలు,ఇతర దేశాల నుండి వచ్చే వారికి సక్రమంగా టెస్టులకు చేయడంతో పాటు వారిని 14రోజులపాటు క్వారంటైన్ కేంద్రాలలో ఉంచాలని స్పష్టం చేశారు.ఈవిధంగా వచ్చిన వారికి మొదటి రోజు తర్వాత 14వ రోజు రెండు సార్లు టెస్టులు నిర్వహించాలని సిఎస్ స్పష్టం చేశారు.   మద్యం దుకాణాల నిర్వహణ ఏవిధంగా ఉందని కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.కొన్ని జిల్లాల్లో టోకెన్లు ఇవ్వడం గొడుగులుతో వచ్చి భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకుంటున్నారని అన్ని జిల్లాల్లో విధమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా కంటైన్మెంట్ ప్రాంతాలకు వెళుపల ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని సిఎస్ స్పష్టం చేశారు.ఇందుకై ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు.

 

 

కొవిడ్ కంట్రోల్ రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ మరియు ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు మాట్లాడుతూ విదేశాల నుండి వచ్చే వారిని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విశాఖ, విజయవాడలకు నాలుగేసి జిల్లాలు,తిరుపతికి ఐదు జిల్లాలను మ్యాపింగ్ చేశామని చెప్పారు.వచ్ఛే వారం నుండి విదేశీ ప్రయాణీకులు రాష్ట్రానికి రానున్నారు. ఆవిధంగా వచ్చిన వారి వివరాలను ఆన్లైన్లో అప్ లోడ్ చేయాలని చెప్పారు.వారు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ కు వెళతారా లేక పేమెంట్ క్వారంటైన్ కు వెళతారో తెల్సుకుని ఆప్రకారం ఏర్పాట్లు చేయాలని అన్నారు.అంతేగాక స్థానిక హోటళ్ళతో మాట్లాడి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి డిన్నర్ కు కలిపి ధరలు ఖరారు చేయాలని చెప్పారు.  ఈ వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  సతీష్ చంద్ర, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.భాస్కర్, రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ పియూష్ కుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం, సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: