తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ పై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కరోనా సమయంలో  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆచితూచి అడుగులు వేస్తోంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిల్లా విద్య, ఇంటర్ విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు.  

 

పదో తరగతి పరీక్షలు ఈ నెలలోనే జరుగుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ కూడా వెంటనే ప్రారంభమవుతుందన్నారు. కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించామని చెప్పారు. దీంతో పదో తరగతి పరీక్షల నిర్వహణ ఎలా అనే దానిపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. లక్షల్లో విద్యార్థులు పరీక్ష రాయనుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఏర్పాట్లను ప్లాన్ చేస్తోంది. కరోనా కారణంగా భౌతిక దూరం పాటించడం, పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయడంపై చర్చ జరుగుతోంది. 

 

షెడ్యూల్ ప్రకారం మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు పదో తరగతి పరీక్షలు జరగాల్సింది. 5 లక్షల 34మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండటంతో 2వేల 530 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది బోర్డు. అయితే ఇప్పుడు కరోనా వల్ల పరీక్ష కేంద్రాలను పెంచాల్సి ఉంది. రెడ్‌జోన్‌లో ఉన్న గ్రేటర్ పరిధిలో ఎక్కువ సంఖ్యలో పరీక్ష రాయనున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ విషయంలోనూ వాల్యుయేషన్ సెంటర్లను పెంచాల్సి ఉంటుంది. పేపర్ కరెక్షన్ చేసే అధ్యాపకులకు, సిబ్బందికి రవాణా సౌకర్యం కల్పించాలి. దీనిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జిల్లా విద్యాశాఖ అధికారులు, జిలా ఇంటర్ విద్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ అంశాల పై చర్చించారు. 

 

ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ విషయంలో ప్రస్తుతం ఉన్న 12 సెంటర్లతో పాటు వాటికి దగ్గరలోనే మరో 21 చోట్ల వాల్యుయేషన్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు నుంచి పేపర్లకు కోడింగ్ వేయడం ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. 20శాతం పేపర్లకు కోడింగ్ ఇవ్వాల్సి ఉందని ఇది పూర్తి చేయడంతో పాటు పేపర్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చే వారికి కావాల్సిన ఏర్పాట్లు ఈ నెల 11 వరకు పూర్తి చేసి 12వ తేదీ నుంచి పేపర్లు దిద్దే కార్యక్రమం చేపడతామని అన్నారు... వాల్యుయేషన్ చేసే వారి రవాణా కోసం ప్రైవేట్ కాలేజీల బస్సులను ఉపయోగించుకునున్నారు. వాల్యుయేషన్ సెంటర్లో క్యాంటీన్లు ఏర్పాటుచేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి మూడు మాస్క్ లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి వసతి కూడా కల్పించనున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: