దేశ వ్యాప్తంగా మూడో విడత లాక్‌డౌన్‌ అమలవుతోంది. అయితే ప్రస్తుతం రెడ్‌ జోన్లలోనే కఠిన నిబంధనలు అమలువుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో నిబంధనల్ని చాలా వరకూ సడలించారు. షాపులు తెరచుకోడానికి అనుమతిచ్చారు. త్వరలోనే ప్రజా రవాణాపై కూడా ఆంక్షల్ని తొలగిస్తామంటోంది కేంద్రం. 

 

లాక్‌డౌన్‌ వల్ల దేశ వ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆంక్షల్ని సడలిస్తున్నా... ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. వలస కూలీలను సైతం రాష్ట్ర ప్రభుత్వాలే ప్రత్యేక బస్సులు, రైళ్లలో గమ్యస్థానాలకు పంపుతున్నాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలను తెరచుకోడానికి ప్రభుత్వం అనుమతించినా... ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు. అయితే, త్వరలోనే ప్రజా రవాణా వ్యవస్థ ప్రారంభం కానుందంటూ చల్లటి కబురు చెప్పారు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ.


 
ప్రజా రవాణా వ్యవస్థ పునఃప్రారంభానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తోంది కేంద్రం. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకూడదంటే వ్యక్తిగత దూరం పాటించాలి. దీనికి తగ్గట్టుగా మార్గదర్శకాలు ఉండబోతున్నాయి.  బస్సు, కారు ఆపరేటర్స్‌ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాలను ప్రస్తావించారు మంత్రి. 

 

రవాణా రంగానికి సంబంధించిన బెయిల్‌ఔట్‌ ప్యాకేజీ గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ రంగంలో ఉన్న అన్ని సమస్యలూ తనకు తెలుసన్న గడ్కరీ, త్వరలోనే అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. 

 

కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవాలని పరిశ్రమ వర్గాలకు సూచించారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. ఇప్పుడున్న స్థితిలో చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. ఇదే అవకాశంగా భావించి విదేశీ పెట్టుబడిదారులను భారత పరిశ్రమ వర్గాలు ఆకర్షించాలని సూచించారు. కరోనాతో పాటు, ఆర్థిక మందగమనం నుంచి కూడా గట్టెక్కుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రవాణాకు లండన్‌ మోడల్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు. జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులు పునః ప్రారంభయ్యాయని తెలిపారు గడ్కరీ.  

 

మార్చి 24న లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత దేశంలో ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఇది గాడిలో పడితో పడితే తప్ప దేశంలో మిగతా రంగాలు వేగం పుంజుకునే అవకాశం లేదు. దీంతో సాధ్యమైనంత త్వరగా ప్రజా రవాణా వ్యవస్థను ప్రారంభించడం ద్వారా... ఆర్థిక కార్యకలాపాలను పరుగులు పెట్టించాలనే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: