రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌, సభ్యుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కత్తెర వేయనుంది కేంద్రం. ఇప్పుడు ఈ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును పాస్ కానివ్వం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. 

 

ఇంతకీ విషయం ఏంటంటే, కేంద్ర విద్యుత్‌ చట్టం 2003లో సవరణలు ప్రతిపాదిస్తూ విద్యుత్‌ చట్టం ముసాయిదా బిల్లు-2020ను రూపొందించింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలిచ్చేందుకు జూన్ 5 వరకు గడువిచ్చింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా.. కేంద్రం వెనక్కి తగ్గడంలేదు. ఈ బిల్లు ప్రకారం కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి, అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌, ఎలక్ర్టిసిటీ కాంట్రాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీల చైర్మన్‌, సభ్యులను కేంద్రమే నియమించనుంది. ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉంటారు. 

 

విద్యుత్‌ కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి కంపెనీలతో చేసుకునే ఒప్పందాలకు రాష్ట్రాలు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేస్తోంది. పీపీఏల అమలును పర్యవేక్షించేందుకు ఎలక్ర్టిసిటీ కాంట్రాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని తాజా ముసాయిదాలో ప్రతిపాదించింది. ఇక పునరుత్పాదక ఇంధనం కొనకపోతే.. డిస్కమ్‌లకు జరిమానా విధించనున్నారు. ఏటా ఈఆర్సీ నిర్దేశించిన మొత్తంలో డిస్కమ్‌లు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిందే. అంతకు ఏమాత్రం తక్కువగా కొనుగోలు చేసినా.. యూనిట్‌కు 50 పైసల చొప్పున డిస్కమ్‌లు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 

 

కేంద్రం ప్రతిపాదించిన సవరణలపై రాష్ట్రప్రభుత్వాలనుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, సభ్యుల నియామకం రాష్ట్రం పరిధిలో ఉండేది. కానీ కొత్త చట్టంతో ఈ నియామకాలు కేంద్రం పరిధిలోకి వెళ్లనున్నారు. కొత్త బిల్లు వల్ల రాష్ట్రాలకు నష్టమేనని విద్యుత్‌ రంగ నిపుణులంటున్నారు. 

 

ఈ చట్టం అమలైతే.. ఇకపై విద్యుత్‌ రంగం మీద అజమాయిషీ క్రమంగా కేంద్రం చేతుల్లోకి వెళ్లనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనాతో దేశం, ప్రపంచం అతలాకుతలమవుతుంటే.. సంస్కరణలకు ఇదా సమయం? అంటూ విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్ సవరణ బిల్లుపై రాష్ట్రప్రభుత్వాలతో చర్చించాకే కేంద్రం నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఇలాంటి బిల్లుకు మద్దతు ఇస్తే రాబోయే రోజుల్లో చాలా అంశాలపై రాష్టాల హక్కులను, అధికారాలను  కేంద్రం హరించే అవకాశముందనే వాదన వ్యక్తమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: