క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ పోషిస్తున్న పాత్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఓ వైపు పార్టీ నేత‌ల‌తో స‌మ‌న్వ‌యం చేఉకుంటూనే మ‌రోవైపు ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రిగా త‌న వంతుగా ఈ క్లిష్ట స‌మ‌యంలో వ్యూహాత్మ‌క పాత్ర పోషిస్తున్నారు. గత కొద్దికాలంగా సంక్షోభ స‌మ‌యంలో ప‌రిశ్ర‌మ ప‌థాన్ని నిర్దేశించేందుకు ఆయ‌న కృషి చేస్తున్నారు. ఇటీవ‌లే కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌కు  ఒక లేఖ రాసి అందులో దేశంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకొనిరావడంతోపాటు ఆర్థికవ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయన కొన్ని సూచనలు చేశారు. దీనికి కొన‌సాగింపుగా తాజాగా ఆయ‌న యూరప్‌ దేశాల రాయబారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో పాల్గొన్నారు. 

 

కోవిడ్‌-19 తదనంతరం పరిశ్రమలపై పడే ప్రభావం, భవిష్యత్‌ అవకాశాలపై భేటీలో తెలంగాణ  రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలంగాణలోని ప్రగతిశీల పారిశ్రామిక విధానాన్ని వివరించారు. రాష్ర్టాల్లోని అనుకూల పరిస్థితులను ప్రత్యేకంగా గమనించాలని కోరారు. తెలంగాణలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. టీఎస్‌-ఐపాస్‌ ద్వారా సులభతర వాణిజ్యంలో ప్రమాణాలు నెలకొల్పామన్నారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు పారిశ్రామిక వర్గాలతో సమావేశమైన మంత్రి కేటీఆర్‌ ఇందు కోసం వివిధ దేశాల రాయబారుల సహాయాన్ని కోరారు.

 

కాగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు రాసిన లేఖ‌లో కరోనా సంక్షోభంతో ఏర్పడిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి  కేంద్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విధానాల్లో కూడా సమూల మార్పులు రావాల్సిన అవసరముంద‌ని తెలిపారు. సులభతర వాణిజ్య విధానాలను(ఈవోడీబీ) కూడా మార్చి దేశాన్ని టాప్‌20 జాబితాలో చేర్చేందుకు ప్రయత్నించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైన అవకాశాలు ఏర్పడుతున్నాయని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ``దేశ ఆర్థిక వ్యవస్థ, రానున్న పెట్టుబడులు, పరిశ్రమలపై ఒక ఎంపవర్డ్‌ స్ట్రాటజిక్‌ గ్రూప్‌ను ఏర్పాటుచేయాలి. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులతోపాటు పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు, పాలసీ నిపుణులు ఉండాలి. పాత కాలం నాటి కార్మిక చట్టాలతో పాటు బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన చట్టాలను సమూలంగా మార్చాలి. ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేకుండా పెట్టుబడులపై స్థిరమైన, కచ్చితమైన, నమ్మకమైన, విధానాలు ఉండాలి. దేశంలో మౌలిక వసతులు, నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.`` అని కేటీఆర్ కేంద్రానికి రాసిన లేఖ‌లో సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: