కేరళ, తమిళనాడు పొరుగు రాష్ట్రాలు. భాషలు వేరు... సంస్కృతి- సంప్రదాయాలు వేరు. ఆఖరికి కరోనా వైరస్‌ విషయంలో కూడా ఆ రెండూ భిన్నంగా వ్యవహరించాయి.  కేరళ మొదటి నుంచి ఫోకస్‌ పెట్టి... వైరస్‌ను కట్టడి చేసింది. తమిళనాడు మాత్రం ఆరంభంలో నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోతోంది. 

 

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో మొదటి నుంచి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది కేరళ సర్కార్‌. ఇంత వరకూ 502 మందికి కరోనా సోకితే... 462 మంది పూర్తిగా కోలుకున్నారు. మరణాలను నాలుగుకు పరిమితం చేయడంలో విజయం సాధించింది కేరళ. అంతేకాదు... నిన్న ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు తమిళనాడులో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో అక్కడ 771 పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 324 కేసులు ఒక్క చెన్నై నగరంలోనే ఉన్నాయి. అరియలూరులో 188, కడలూరులో 95, కాంచీపురంలో 45, తిరువళ్లూరులో 34 కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడు కరోనా బాధితుల సంఖ్య 4 వేల 829కి చేరింది. అలాగే, కరోనాతో తమిళనాడులో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. 1516 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.  


  
దేశంలోని తొలి మూడు కరోనా కేసులు కేరళలోనే నమోదయ్యాయి. అయితే కరోనా కట్టడి విషయంలో కేరళ అనుసరించిన విధానం దేశానికి ఆదర్శంగా నిలిచింది. విదేశాల నుంచి వచ్చే వాళ్లు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశించింది. కొన్ని వారాల తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా దీనిని వర్తింపజేసింది. పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, పాజిటీవ్‌ వచ్చిన వాళ్ల కాంటాక్ట్‌లను గుర్తించడం, అనుమానితులను ఎక్కువ కాలం క్వారంటైన్‌లో ఉంచడం వంటి చర్యలతో కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయలగలిగింది కేరళ. 

 

మొదట్లో కరోనాను తేలిగ్గా తీసుకున్నారు తమిళులు. ఎద్దు చనిపోతే వెయ్యి మందికి పైగా గుమిగూడి అంత్యక్రియలు నిర్వహించారు. ఓ ఆలయంలో వంద మంది ఒకే ఆకులో భోజనం చేశారు ఆకతాయిలు. పైగా కరోనా ఫుడ్‌ఫెస్టివల్‌ పేరుతో దానిని షోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా నిబంధనల్ని పాటించకపోవడం వల్ల ఇప్పుడు పర్యవసానాలను అనుభవిస్తున్నారు. తమిళనాడులో మున్ముందు పరిస్థితి మరింత దిగజారేలా ఉంది. దీంతో ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో అర్థంకాక... తలలు పట్టుకుంటున్నారు పాలకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: