గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ...జగన్ ప్రభుత్వంపై ఒంటి కాలి మీద వెళుతున్న విషయం తెలిసిందే. కరోనాని కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు చేస్తున్నారు. అసలు డైలీ మీడియా సమావేశం పెట్టడం, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చేస్తున్నారు. ముఖ్యంగా కర్నూలులో కరోనా కేసులు పెరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ మండిపడుతున్నారు.

 

అదేవిధంగా కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలు కృషి చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. తాజాగా వైసీపీ నేతలు లాక్ డౌన్ నింబంధనలు ఉల్లఘించారని చెబుతూ, కర్నూలు జిల్లాలోని అహోబిలం నరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వెళ్లారంటూ సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వైసీపీ నాయకుల కోసం దేవాలయాలు ఎందుకు తెరిచారు? అని ప్రశ్నిస్తూనే,  లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డ వీరిపై కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసారు.

 

అఖిల చేసిన విమర్శలపై ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌ రెడ్డి స్పందించారు.  గుడిని బలవంతంగా తెరిపించామని ఆరోపణలు చేయడం దుర్మార్గమైన ఆలోచన అని, అలాంటి మాటలు పక్కన పెట్టాలని,  టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని చంపడానికి రూ. 50 లక్షలు సుపారి ఇచ్చిన ఘనత నీది కాదా ? అని నిలదీశారు.

 

అయితే కర్నూలులో చాలామంది సీనియర్ నేతలు ఉన్నాసరే అఖిలనే కాస్త హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఆమె జిల్లాపై పట్టు తెచ్చుకోవడానికి ఈ స్థాయిలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే అఖిల చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతల నుంచి భారీ కౌంటర్లు ఏమి రాలేదు. కానీ ఇప్పుడు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఊహించని ఆరోపణ చేసి, అఖిలని కాస్త కట్టడి చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

 

కాగా, ఒకే పార్టీలో ఉన్న అఖిలకు, ఏవీ సుబ్బారెడ్డిలకు పడదన్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరి విభేదాలు తారాస్థాయిలో ఉండేవి. ఇక ఇటీవల సుబ్బారెడ్డిని చంపడం కోసం సుపారీ  తీసుకున్న వ్యక్తులు దొరికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గంగుల, అఖిలని ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేసి, రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: