గడచిన పది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గ్రైటర్ హైదరాబాద్ మినహా ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం లేదు. నిన్న 15 కొత్త కేసులు నమోదు కాగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1122కు చేరింది. కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తోంది. 
 
సీఎం కేసీఅర్ మొన్న రాత్రి రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ ను మే నెల 29 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ యాక్ట్ ప్రకారం ఆదేశాలు విడుదలయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలలో జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేక శ్రామిక్ రైళ్లు మినహా రాష్ట్రంలో మిగతా రైలు సర్వీసులను రద్దు చేసింది. 
 
అంతర్ రాష్ట్ర, జిల్లాల ప్రయాణాలపై నిషేధం విధించింది. మాస్క్ లేకుండా బయటకు వస్తే 1000 రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటన చేసింది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని సూచించింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఈ కామర్స్ సంస్థలకు అనుమతులు ఇస్తున్నట్టు పేర్కొంది. మెట్రో సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, ట్రైనింగ్ సెంటర్లను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. 
 
రాజకీయ, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. రెడ్ జోన్లలో కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రెడ్ జోన్లలో ఐటీ ఆఫీసులు, ప్రైవేట్ కార్యాలయాలు 33 శాతం ఉద్యోగులతో పని చేయాలని పేర్కొంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి ఉద్యోగుల సామర్థ్యంతో పని చేయవచ్చు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు ఎలాంటి జన సంచారానికి అనుమతి లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: