మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వైరస్ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను దేశానికి రప్పించాలని కేంద్రం వందే భారత్ మిషన్ ను ప్రారంభించింది. వందే భారత్ మిషన్ లో భాగంగా తొలి విమానం భారత్ కు చేరుకుంది. 
 
177 మంది ప్రయాణికులు ఎయిర్ ఇండియా విమానంలో స్వదేశంలో అడుగుపెట్టారు. అబుదాబి నుంచి వచ్చిన ప్రత్యేక విమానం కేరళలోని కొచ్చిలో ల్యాండ్ అయింది. ఈ విమానంలో 49 మంది గర్భిణులు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రం వీరందరూ తమ సొంత ఖర్చులతో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించింది. ప్రయాణికులతో పాటు బ్యాగేజీని డీఆర్డీవో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యూవీ డిస్ ఇన్ఫెక్టర్ తో అధికారులు శానిటైజ్ చేయనున్నారు. 
 
యూవీ డిస్ ఇన్ఫెక్టర్ ను డీఆర్డీవో తొలిసారి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. అధికారులు ఐదు రోజుల్లో గల్ఫ్ లోని వివిధ దేశాల నుంచి దాదాపు రెండు వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారని సమాచారం. వీరంతా కన్నూరు, కోజికోడ్, కొచ్చి, తిరువనంతపురం చేరుకోనున్నారు. మరోవైపు సముద్ర సేతు ఆపరేషన్ లో భాగంగా మాల్దీవుల రాజధానికి చేరుకున్న తొలి నౌక తిరిగి పయనమైందని తెలుస్తోంది. 
 
నేవీకి చెందిన ‘ఐఎన్‌ఎస్‌ జలాశ్వ’ యుద్ధనౌక ఈరోజు సాయంత్రం 1000 మంది ప్రయాణికులతో కొచ్చి తీరానికి చేరుకోనుంది. కరోనా కట్టడి కోసం కేంద్రం లాక్ డౌన్ విధించడంతో లక్షల సంఖ్యలో భారతీయులు ఇతర దేశాల్లో చిక్కుకుపోయారు. కేంద్రం ప్రత్యేక విమానాలు, నౌకల సహాయంలో భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నాలను మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాల నుంచి భారత్ కు ఎక్కువమంది తిరిగిరానున్నారు. దాదాపు మూడు లక్షల మంది ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: