విశాఖ గ్యాస్ దుర్ఘటన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చివరకు ఎప్పుడూ జగన్ నిర్ణయాలను తప్పుబట్టే నేతలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కూడా చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.

 

 

విశాఖ పట్నం గ్యాస్ లీకేజీ బాధితులకు జగన్ ప్రకటించిన పరహారం ప్యాకేజీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సానుకూలంగా స్పందించారు. తాము ఊహించిన దాని కన్నా జగన్ నాలుగు రెట్లు ఎక్కువ సాయాన్ని ప్రకటించారని ఆయన మెచ్చుకున్నారు. ఇందుకు తాము జగన్ ను అభినందిస్తున్నామన్నారు.

 

 

మృతుల కుటుంబాలనే కాకుండా, బాధిత గ్రామాల ప్రజలను ఆదుకున్న తీరు ప్రశంసనీయమని సీపీఐ నారాయణ ప్రశంసించారు. ఎప్పుడూ జగన్ పై విరుచుకుపడే బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. వీరే కాదు.. బాధితులకు నష్టపరిహారాన్ని ప్రకటించి సీఎం వైఎస్‌ జగన్‌ వారిని ఆదుకున్న తీరు హర్షణీయమని సీపీఐ, సీపీఎం కార్యదర్శులు కె.రామకృష్ణ, పి. మధు కూడా అన్నారు. పరిశ్రమను అక్కడి నుంచి తరలించడంతో పాటు.. ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపించాలన్నారు.

 

 

చివరకు టీడీపీ నేతలు సైతం జగన్ ను ఈ విషయంలో మెచ్చుకున్నారు. విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ బాధితులకు సీఎం ప్రకటించిన పరిహారం ఉపశమనం కలిగిస్తుందన్నారు. అయితే... ఇలాంటి ప్రమాదం మరోసారి జరగకుండా కంపెనీని నివాస ప్రాంతాల మధ్య నుంచి తరలించాలని గణబాబు కోరారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: