విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటన కారణంగా 12 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ఆసుపత్రుల పాలయ్యారు. విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రి బాధితుల రోదనలతో మారుమోగింది. కేజీహెచ్ ఆసుపత్రిలో అనేక హృదయ విదారక దృశ్యాలు కంటతడి పెట్టించాయి. కుటుంబంలో ఒక్కొక్కరి ఒక్కోచోట చికిత్స అందు కుంటున్నారు. తమ వారు ఎక్కడ ఉన్నారో మరొకరికి తెలియని హృదయ విదారక పరిస్థితి.

 

 

ఇక ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల తల్లిదండ్రుల స్థితి మరీ దారుణం. గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. అందులో ఆరేళ్ల పాప పేరు కుందన శ్రేయ. ఈ పాప కేజీహెచ్‌కు తీసుకొచ్చేలోపే దారిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రికి వచ్చేలోగానే మృతి చెందినట్లు కేజీహెచ్ వైద్యులు చెప్పారు. అయితే ఇలాంటి దుర్ఘటనల సమయంలో మృతుల శవాలకు పోస్టుమార్టం తప్పనిసరి.

 

 

కానీ చనిపోయింది ఆరేళ్ల పసిపాప కాడవంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాప మృత దేహానికి పోస్టు మార్టం వద్దని విజ్ఞప్తి చేశారు.. పసిపాపయ్యా... పోస్టు మార్టం వద్దయ్యా అంటూ వేడుకున్నారు. నిన్నటి వరకూ ఆడిపాడిన చిన్నారిని పోస్టుమార్టం చేస్తారన్న ఊహే వారిని భయ కంపితులను చేసింది. ఈ సమాచారం తెలుసుకుని ఆసుపత్రికి చేరుకున్న బంధువులు సైతం.. పోస్టుమార్టం చేస్తారని తెలుసుకుని గుండెలవిసేలా రోదించారు.

 

 

పసిపాపకు పోస్టుమార్టం వద్దయ్యా.. అంటూ వైద్యులను బతిమాలుకున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావునూ వేడుకున్నారు. పోస్టుమార్టం చేయకుండానే పాప మృతదేహాన్ని ఇవ్వాలని ప్రాధేయపడ్డారు. అయితే నిబంధనల ప్రకారం పోస్టుమార్టం తప్పనిసరి అంటూ వారికి సర్దిచెప్పారు. ఈ దృశ్యం ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: