ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ 50కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. జిల్లాలో నిన్నటివరకు 540 కరోనా కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 
 
ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో కరోనా భారీన పడి 12 మంది మృతి చెందారు. అయితే తాజాగా జిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా నిర్ధారణ కావడం జిల్లాలో కలకలం రేపింది. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకింది. అయితే ఈ కుటుంబంలోని ఇద్దరు మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరికి కరోనా నిర్ధారణ కావడంతో ఇన్నిరోజులు నీటి కోసం ప్లాంట్ కు వచ్చిన వారిలో ఆందోళన మొదలైంది. 
 
గతంలో ఈ కుటుంబంలోని ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ కాగా తాజాగా అతడి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు, అల్లుడుకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అధికారులు వీరితో సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్ కు పంపే పనిలో పడ్డారు. గ్రామంలో మినరల్ ప్లాంట్ కు వెళ్లిన వారి వివరాలను ఆరా తీయడంతో పాటు ఎవరిలోనైనా వైరల్ లక్షణాలు కనిపిస్తే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
మరోవైపు జిల్లాలో గతంతో పోలిస్తే రెండు రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మొన్న జిల్లాలో 17 కరోనా కేసులు నమోదు కాగా నిన్న 7 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు ఏపీలో నిన్న ఒక్కరోజే 56 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1833కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: