కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రంగాల్లో మీడియా కూడా ఒకటని కొన్ని రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాం.. అసలే కష్టాల్లో ఉన్న పత్రికలను ఇప్పుడు కరోనా మరింతగా దెబ్బతీసింది. పేపర్ తో కరోనా వస్తుందన్న ప్రచారానికి తోడు.. ఇప్పుడు పత్రికల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఎంతగా నష్టాల్లో ఉన్నాయంటే.. మీరు ఆదుకోవాల్సిందే అంటూ భారతీయ వార్తా పత్రికల సంఘం ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది.

 

 

ఇక పత్రికల కష్టాలను కళ్లకు కట్టేలా ఈనాడు ఈరోజు ఓ కార్టూన్ ప్రచురించింది. రెండు నెలలుగా పత్రికలకు ఆదాయం సున్నా అని.. వ్యాపార ప్రకటనలు పూర్తిగా ఆగిపోయాయని ఆ కార్టూన్‌ ద్వారా తెలిపారు. లాక్ డౌన్ కారణంగా చివరకు పత్రికారంగం ఐసీయూలోకి వెళ్లిపోతోందని.. ఈ కార్టూన్ ద్వారా చెప్పారు. స్వయంగా తెలుగులో అగ్రశ్రేణి దినపత్రిక ఈనాడే ఇలాంటి కార్టూన్ వేసిందంటే.. పత్రికల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.

 

 

కష్టాల్లో ఉన్న పత్రికారంగాన్ని ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదికి విజ్ఞప్తి చేసిన భారతీయ వార్తా పత్రికల సంఘం...ప్రకటనలకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిల సొమ్మును కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు వెంటనే విడుదల చేయాలని కోరింది. వార్తా పత్రికల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారని.. అందుకే ఈ రంగాన్ని కాపాడాలని కోరింది.

 

 

పత్రికలకు ఒకపక్క ఖర్చులు పెరుగుతున్నాయని.. మరోపక్క ఆదాయం లేకుండా పోతోందని వాపోయింది. ఏప్రిల్‌ వరకూ ఉన్న ప్రభుత్వ ప్రకటనల బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపాణీ హామీ ఇచ్చిన హామీని ఈ సంఘం ప్రధానికి గుర్తు చేసింది. మరి ప్రధాని స్పందిస్తారా.. చూడాలి.

( కార్టూన్‌: ఈనాడు )

మరింత సమాచారం తెలుసుకోండి: