దేశాన్ని కదలించిన విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఓ కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఈ గ్యాస్ ప్రమాదం ద్వారా పది మందికిపైగా మరణించారన్న వార్త తెలియగానే.. సీఎం వెంటనే స్పందించారు. సహాయక చర్యల కోసం ఆదేశించారు. ఘటనాస్థలాన్ని తాను కూడా బయలు దేరారు. అక్కడికి వెళ్లే లోపే.. ఈ గ్యాస్ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు.

 

 

జగన్ పరిహారం ప్రకటనతో మిగిలిన పార్టీల నేతలంతా అవాక్కయ్యారు. వారు అప్పటి వరకూ మృతుల కుటుంబాలకు పాతిక లక్షల పరిహారం ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. జగన్ ఏకంగా కోటి రూపాయల పరిహారం ప్రకటించడంతో వారంతా దాన్ని స్వాగతించారు. ప్రమాద ఘటనల్లో ప్రభుత్వాలు పరిహారం ప్రకటించడం సాధారణమే అయినా అది 5 లక్షలకు మించి చాలా సందర్భాల్లో ఉండదు.

 

 

కానీ ఇప్పుడు జగన్ ఏకంగా కోటి రూపాయలు ప్రకటించారు. ఓ ప్రమాదం జరిగినప్పుడు ఎంత పరిహారం చెల్లించినా పోయిన ప్రాణాన్ని వెనక్కు తీసుకురాలేం.. ఒక ప్రాణం విలువ ఎంత అంటే ఎవరైనా ఏమైనా చెప్పగలరా.. కానీ ఆ పరిహారం.. కనీసం ఆర్థికంగా ఆ కుటుంబానికి అండగా నిలిచేలా ఉండాలి కదా. ఇప్పుడు జగన్ అదే చేశారు. భారీగా కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించేసరికి చాలా మంది నేతలకు నోటమాట రాలేదు.

 

 

జగన్ నిర్ణయాన్ని ఇప్పుడు మానవతావాదులు స్వాగతిస్తున్నారు. జగన్ పరిహారం ప్రకటన ద్వారా ఇప్పుడు దేశంలోనే ఓ కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇకపై దేశంలో ఇలాంటి ప్రమాదం జరిగితే పరిహారం కచ్చితంగా కోటి రూపాయలు ప్రకటించాలన్న ఒత్తిడి ఉంటుంది. ఇది బాధిత కుటుంబాలకు చాలా వరకూ న్యాయం చేస్తుంది. జగన్ ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని మిగిలిన వారూ అనుసరించాల్సిన అనివార్యత వస్తుంది. ఇది బాధితులకు కొండంత ధైర్యాన్నిస్తుంది. పోయిన ప్రాణం తీసుకురాలేకపోయినా ఇతర కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: