కరోనా అందరిని కష్టాల్లోకి నెట్టేసింది..కరోనా వైరస్ వల్ల ఎవరికీ వారు ఇంటికే పరిమితం అయ్యారు. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. దీనితో చాలామంది డబ్బులు లేక, తిండిలేక నానా తిప్పలు పడుతున్నారు. అయితే వలస కూలీల అగచాట్లు అయితే ఇంకా చెప్పక్కర్లేదు.. తిండిలేక, ఇల్లు గడవక చాలా మంది సొంత ఊళ్ళకి వెళ్లిపోతున్నారు.. అయితే పాపం  బతుకుదెరువు కోసం వచ్చిన కూలీలు తమ సొంత ఊరికి బయలుదేరిన నేపథ్యంలో ఒక  రోడ్డుప్రమాదానికి బలయ్యారు. అసలు వివరాలలోకి వెళితే.. 

 

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కృష్ణ సాహు(45), ప్రమీల(40) దంపతులు ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు కొన్నేళ్ల క్రితం వెళ్లారు. వీరికి ఇద్దరు సంతానం.. ఇద్దరి వయసు కూడా ఐదేళ్లలోపే. కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో ఈ కుటుంబానికి ఉపాధి దొరకడం కష్టమైంది. ఇల్లు గడవడం కూడా కష్ట తరం కావడంతో  తమ సొంతూరికి వెళ్లాలని సాహు దంపతులు నిర్ణయించుకున్నారు.అయితే వెళ్ళడానికి ఎటువంటి వాహనాలు లేవు. దేశం మొత్తం పటిష్టంగా లాక్ డౌన్ అమలవుతుంది. 

 

దీనితో గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని తమ సొంతూరుకి సైకిల్‌పై బయల్దేరారు.లక్నోకు సమీపంలోని షాహీద్‌ పాథ్‌ వద్ద సైకిల్‌పై వెళ్తున్న సాహు కుటుంబాన్ని ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సైకిల్‌ ముక్కలు ముక్కలైంది. సాహు, ప్రమీల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పసి పిల్లలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.

 

ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. అక్కడున్న ఓ ఫోటో ఆధారంగా మృతులను గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. సాహు సోదరుడు అక్కడికి చేరుకుని మృతదేహాలను గుర్తించాడు. పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.. ఆక్సిడెంట్ చేసిన డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు... 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: