విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. అటు విశాఖలో పరిస్థితి సీఎం జగన్ రివ్యూ చేశారు. వీడియో కాన్ఫెరెన్స్ లో విశాఖ నుంచి సీఎస్ తో పాటు కలెక్టర్, పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ సిద్ధం చేయాలని జగన్ అధికారులకు సూచించారు. 

 

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ అధ్యక్షతన నియమించిన ఈ కమిటీలో.. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి కరికాల్‌ వలెవన్‌, విశాఖ జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, నగర పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్‌ యాదవ్‌ సభ్యులుగా ఉంటారని పేర్కొంది.

 

స్టైరీన్‌ గ్యాస్‌ లీకేజీ ప్రమాదంతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై ప్రామాణిక విధానాన్ని రూపొందించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఎల్‌జీ పాలిమర్‌ సంస్థ యూనిట్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించిన ఘటనను లోతుగా విచారణ చేయడంతోపాటు సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందా? అన్న అంశంపై కూడా అధ్యయనం చేయాలని సూచించింది.

 

గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన, అనంతరం తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎస్‌ నీలం సాహ్ని, కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌ కే మీనా పాల్గొన్నారు. ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌ నివారణకు చేపట్టిన చర్యలను సీఎంకు కలెక్టర్‌ వినయ్‌చంద్ వివరించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని సీఎస్‌ నీలం సాహ్ని తెలిపారు. 

 

జరిగిన ఘటనపై దర్యాప్తు చేసి తగిన కార్యాచరణ, ప్రణాళికతో రావాలని సీఎం జగన్ సూచించారు. కాలుష్య నివారణా మండలి క్రియాశీలకంగా ఉండాలని తెలిపారు. కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటి నివారణకు, పాటించాల్సిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. విశాఖపట్నంలో ఇలాంటి విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని, అందులో జనావాసాల మధ్య ఉన్న పరిశ్రమలను గుర్తించాలన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై దృష్టిపెట్టాలన్నారు.  ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. లేదా ఉన్న ముడిపదార్థాలను పూర్తిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాల్సిన మార్గాలపైకూడా ఇంజినీర్లతో మాట్లాడాలన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: