ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజుల నుంచి కర్నూలులో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. జిల్లాలో నమోదవుతున్న కేసుల కంటే డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య తగ్గుతుండడంతో కర్నూలు వాసులకు ఉపశమనం కలుగుతోంది. జిల్లాలో నిన్న 7 కేసులు నమోదు కాగా ఈరోజు మరో 7 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 547కు చేరింది. 
 
నిన్న ఒక్కరోజే జిల్లాలో 26 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. నంద్యాల శాంతిరామ్ ఆస్పత్రి నుంచి 16 మంది డిశ్చార్జ్ కాగా కర్నూలు విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుంచి 7 మంది జీజీహెచ్ స్టేట్ కరోనా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న డిశ్చార్జ్ అయిన వారిలో 17 మంది పురుషులు, 9 మంది మహిళలు ఉన్నారు. డిశ్చార్జ్ అయిన వారికి కలెక్టర్ వీరపాండియన్ 2000 రూపాయల నగదు అందజేశారు. 
 
రోజురోజుకు డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. జిల్లాలో అత్యధికంగా 14 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్న వృద్ధులు సైతం కరోనాను జయించారని చెబుతున్నారు. 
 
కలెక్టర్ వీరపాండియన్ మనోధైర్యం, నమ్మకం ఉంటే కరోనాను జయించవచ్చని ప్రజలకు సూచించారు. జిల్లాలో కరోనా విజృంభణ తగ్గినా రాష్ట్రంలో మాత్రం ప్రతిరోజూ 50కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు అనంతపురం జిల్లాలో అత్యధికంగా 16 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో  9, విశాఖ జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: