నిన్న విశాఖలో ఎల్.జీ పాలిమర్స్ సంస్థ నుంచి స్టెరైన్ గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో విశాఖలో లీకైన గ్యాస్ వల్ల 12 మంది మృత్యువాత పడగా 193 మంది చికిత్స పొందుతున్నారు. లీకైన గ్యాస్ ప్రమాదకరం కాదని కొందరు చెబుతున్నప్పటికీ... ఆ గ్యాస్ ప్రమాదకరమేనని కొందరు వైద్యులు చెబుతూ ఉండటం గమనార్హం. జగన్ సర్కార్ కరోనాపై ఎంత దృష్టి పెట్టిందో విశాఖ గ్యాస్ లీకేజీని కూడా అలాగే చూడాల్సి ఉంది. 
 
నిన్న రిలీజైన గ్యాస్ ప్రభావం ప్రస్తుతం కనిపించపోయినా భవిష్యత్తులో కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం రాబోయే మూడు నెలల పాటు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఎందుకంటే ఈ గ్యాస్ పీల్చినా కొందరిలో వెంటనే దీని ప్రభావం కనిపించదని... తరువాత కాలంలో మాత్రం ఈ గ్యాస్ ప్రభావం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల భారీన పడే అవకాశం ఉందని అంటున్నారు. 
 
కిడ్నీ సమస్యలు, కలర్ బ్లైండ్ నెస్, క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం.... లైంగిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ ప్రాంత ప్రజలకు మరికొన్ని నెలల పాటు ప్రభుత్వం పరీక్షలు జరిపిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరీక్షించాలి. ప్రభుత్వం వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రభుత్వం తక్షణమే ఈ దిశగా చర్యలు చేపట్టకపోతే గ్యాస్ పీల్చిన వారు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 
మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 54మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1887కు చేరింది. రాష్ట్రంలో 842 మంది డిశ్చార్జ్ కాగా 41 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1004 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: