ప్రాణాంత‌క కరోనా మ‌హమ్మారి వ‌ల్ల క‌లిగిన షాకుల‌లో లాక్ డౌన్ ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఈ స‌మ‌యంలో ఎటూ క‌ద‌ల‌లేని ప‌రిస్థితి. మెజార్టీ ప్ర‌జ‌లు అవ‌స‌రాల కోసం...కొంద‌రు ఆక‌తాయిలు స‌ర‌దా కోసం రోడ్డెక్కారు. అయితే, ప్రభుత్వం విధించిన నిబంధ‌న‌లు ఉల్లఘించార‌ని స‌హ‌జంగానే పోలీసులు త‌గు చ‌ర్య‌లు తీసుకున్నారు. పోలీసులు అడుగడుగునా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి లాక్‌ డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించిన వారి వాహనాలను సీజ్ చేశారు. అలా సీజ్ అయిన వారి బండ్ల విష‌యంలో తాజాగా ఓ తీపి క‌బురు. ఆ బైకులు య‌జ‌మానులు తిరిగి తీసుకోవ‌చ్చున‌ని తెలిపారు.

 


లాక్ డౌన్ స‌మ‌యంలో అనేక మంది వాహన దారులు అకారణంగా రోడ్లపై తిరిగారు. అవసరం ఉండి బయటకు వచ్చినప్ప‌టికీ చిన్న చిన్న వంకలతో రోడ్ల మీదకు వచ్చిన వేలాది వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రోడ్ల పక్కన అనేక ప్రాంతాల్లో ఉంచారు. అయితే వీటిని రక్షించేందుకు పోలీసు శాఖకు అదనపు భారంగా ఉండడంతో నిబంధ‌నలు ఉల్లంఘించిన వారి వాహనాలను తిరిగి ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ మేర‌కు యజమానితో బాండు రాయించుకుని వారికి అప్పగించాలని డీజీపీ పోలీసులకు సూచించారు. అయితే, ఇక్క‌డే ట్విస్ట్ ఉందండోయ్‌. బైక్ ఇప్పుడు చేతికి వ‌స్తుంది కానీ... ఉల్లంఘనలకు సంబందించిన కోర్టు కేసులు మాత్రం కొనసాగనున్నాయి. 

 


ఇదిలాఉండ‌గా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో బోసిపోయిన హైదరాబాద్‌ నగర వీధులు తిరిగి వాహన రాకపోకలతో సందడిగా మారాయి. లాక్‌డౌన్‌ నిబంధనల్లో సడలింపు వల్ల హైదరాబాద్‌ నగరంలో వాహనాల రాకపోకలు పెరిగాయి. నగరంలో స్టీలు, సిమెంట్‌, ఎలక్ట్రికల్‌ షాపులు, రిజిస్ట్రేషన్‌, రవాణాశాఖ కార్యాలయాలు, మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అదేవిధంగా ఐటీ పరిశ్రమల్లోనూ 33 శాతం మంది ఉద్యోగులకు అనుమతినిచ్చారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే రహదారులపైకి 35 శాతం వాహనాలు వచ్చాయి. కాగా వెసులుబాటు కల్పించిన రంగాలకు చెందిన వాళ్లే బయటకు రావాల్సిందిగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇతరులు లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవ‌ని హెచ్చరించారు. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: