కరోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో అనేక ఆస‌క్తిక‌ర‌మైన, చిత్ర‌మైన‌, ఇంకొన్ని బాధాక‌ర‌మైన ప‌రిస్థితుల‌ను మ‌నం చూస్తున్నాం. అదే స‌మ‌యంలో మ‌న వ‌ర‌కు వ‌స్తాయా అనే లైట్ తీసుకునే గుణం చాలా మందిలో ఉంది. అయితే, ప్ర‌భుత్వం కొన్ని విషయాల్లో క‌ఠినంగానే వ్య‌వ‌హరిస్తోంది. కారణాలు ఏవైనా ఇళ్ల‌ నుంచి పనుల కోసం బయటకు వచ్చేవారు విధిగా మాస్క్‌ ధరించాలని, మాస్క్‌ లేకుండా బయటకు వస్తే రూ.1000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. మ‌న‌ల్ని ఎవ‌రు గుర్తు ప‌డ‌తారు అనే భావ‌న‌లో ఉన్న‌వారికి షాక్ లాంటి న్యూస్‌. 

 


క‌రోనా నియంత్రణకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయ‌డం, మాస్కు ధరించని వారికి రూ. 1000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించిప్పటికీ కొందరు మాస్కులు ధరించకుండా యథేచ్చగా తిరుగుతుండ‌టంతో పోలీసులు టెక్నాల‌జీని వాడుకుంటున్నారు. మాస్కులు ధరించని వారిని గుర్తించేందుకు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు)ను ఉపయోగించాలని రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది. డీజీపీ మహేందర్‌ రెడ్డి తాజాగా ఈ విష‌యం గురించి వెల్ల‌డిస్తూ, దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో వినూత్న ప్రయోగం చేపట్టామని తెలిపారు. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో మాస్కులు ధరించకుండా తిరిగే వాళ్లను గుర్తిస్తున్నామని, దీని కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నామని ఆయన చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా జనసమూహాల పరిశీలన కూడా జరుగుతుందన్నారు. త్వరలోనే హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో అమలు చేస్తామని డీజీపీ మహేందర్‌ రెడ్డి వెల్ల‌డించారు.

 

ఇదిలాఉండ‌గా, మాస్కుల విష‌యంలో ఇప్ప‌టికే షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాస్క్ లేని వ్యక్తికి మద్యం అమ్మినందుకు.. మల్లికార్జున వైన్స్ కు రూ. 5 వేల జరిమానా విధించారు. మాస్కులు ధరించిన వ్యక్తులకే మద్యం విక్రయించాలని లేకుంటే జరిమానా విధిస్తామని పురపాలక కమిషనర్ హెచ్చరించారు. అలాగే మంచిర్యాల జిల్లాలో మాస్కులు లేకుండా తిరుగుతున్నవారికి శ్రీరాంపూర్ పోలీసులు రూ.1000 ఫైన్ వేశారు. చెన్నూర్ నియొజకవర్గ కేంద్రంలో ఉదయం మార్కెట్ లో మాస్క్ ధరించకుండా కూరగాయలు అమ్ముతున్నందుకు  మున్సిపల్ అధికారులు  రూ. 500 ఫైన్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: